News

భారత్ నుంచి 4200 కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠాలు

231views

* క్రిప్టోలో పెట్టుబడులు, రుణ యాప్‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనలతో అమాయకులకు ఎర

* చైనా ముతాల గుట్టు రట్టు చేసిన యూపీ పోలీసులు

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, తక్షణ రుణ యాప్ ‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనల పేరిట చైనా ముఠాలు దేశవ్యాప్తంగా రూ.4,200 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు ఉత్తర ‌ప్రదేశ్‌ సైబర్‌ నేరాల విభాగం పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. తక్షణ రుణ యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నవారిని వేధించి అధిక వసూళ్లకు పాల్పడటం, ప్రముఖ సంస్థల్లో పార్ట్ ‌టైం ఉద్యోగాలంటూ ఫోన్లకు సందేశాలు పంపడం ద్వారా చైనా ముఠాలు సుమారు రూ.3 వేల కోట్ల మేర మోసాలకు పాల్పడిన విషయాన్ని ఈ ఏడాది ఆరంభంలో గుర్తించినట్లు యూపీ సైబర్ ‌క్రైమ్‌ ఎస్పీ త్రివేణి సింగ్‌ పేర్కొన్నారు. అయితే చైనా నేరగాళ్లు క్రిప్టో కరెన్సీ మోసాలకు కూడా తెరతీసినట్లు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, క్రిప్టో ట్రేడింగ్‌ కోసం నకిలీ వెబ్‌సైట్లు, యాప్ ‌లు సృష్టించారని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టినవారికి పెద్ద ఎత్తున లాభాలు వచ్చినట్లు ఆ వెబ్‌సైట్లలో నకిలీ లెక్కలు చూపిస్తారని తెలిపారు. చైనా ముఠాలు ఇక్కడి ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును తొలుత స్థానిక బ్యాంకుల్లోని తమ ఖాతాలు, డిజిటల్‌ వ్యాలెట్లలో జమ చేస్తాయని, ఆ తర్వాత భారత్ ‌లోని క్రిప్టో కరెన్సీ మారక వేదిక జెబ్ ‌పేకు, అక్కడి నుంచి అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ మారక వేదిక బినాన్స్ ‌కు తరలుతుందని, అనంతరం ముఠాల ప్రధాన సూత్రధారులకు చేరుతుందని త్రివేణి సింగ్‌ వివరించారు. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆ తరహా మోసాల గురించి సమాచారం తెలిస్తే హెల్ప్ ‌లైన్‌ నంబరు 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.