తిరుపతి: స్విమ్స్‌లో ఫిజియోథెరపీ, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం కోసం ఏర్పాటుచేసిన నూతన వంటశాలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటుచేసిన వంటశాలలోని సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు తయారుచేసే ఆహారానికి సంబంధించిన మెను గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఈవో విద్యార్థులు, హాస్టళ్ల సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థుల నుంచి నెలకు రూ.3500/- వసూలు చేసి కాంట్రాక్టర్ ద్వారా ఇప్పటివరకు భోజన సదుపాయం కల్పించేవారని చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడి నిర్ణయం మేరకు విద్యార్థులందరికీ ఉచితంగా స్వామివారి అన్నప్రసాదం అందిస్తున్నట్టు తెలిపారు. 800 మంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ నిర్ణయం వల్ల కొంతమేరకైనా ఆర్థికభారం తగ్గుతుందని ఈవో చెప్పారు.
టీటీడీ తమకు ఉచితంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజన వసతి కల్పిస్తోందని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు 30 బృందాలుగా ఏర్పడి ప్రతిరోజూ హాస్టల్ గదులు, వంటశాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. అలాగే, హాస్టళ్ల సమీపంలో ఉన్న పార్కును కూడా చక్కగా నిర్వహించుకోవాలన్నారు.
వార్డెన్, డెప్యూటీ వార్డెన్ ఎప్పటికప్పుడు హాస్టళ్లను, వంటశాలను పరిశీలించి సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాకాని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో వ్యవహరించకపోతే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టళ్లు, కళాశాల తమవి అనే భావనతో వ్యవహరిస్తూ విద్యుత్, నీటిని వృథా చేయరాదని చెప్పారు.
Source: TTD News