News

దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి

167views

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం సంచలన ప్రకటన జారీ చేసింది. ముంబయి పేలుళ్ళ‌ నేపథ్యంలో అమెరికా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

గ్లోబల్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం భారతదేశంలో డి గ్యాంగ్ ఆధ్వర్యంలో పలు అరచకాలు సాగిస్తున్నాడు. దావూద్ గ్యాంగ్ ఆయుధాల స్మగ్లింగ్, పేలుళ్లు, డ్రగ్స్ విక్రయం, నకిలీ కరెన్సీ నోట్ల చలామణి, పాక్ సహకారంతో ఉగ్రదాడులు చేస్తోందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

దావూద్ తోపాటు అతని సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ తలపై 20 లక్షల రూపాయలు, అతని సోదరుడు అనీస్ ఇబ్రహీంపై రూ.15 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. దావూద్ అనుచరులైన జావేద్ పటేల్, జావేద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాఖ్, అబ్దుల్ రజాఖ్ మెమోన్ అలియాస్ టైగర్ మెమోన్‌ల ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతులు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది.

దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ సిండికేట్ నడుపుతూ మనీలాండరింగ్, నకిలీ కరెన్సీనోట్ల చలామణి చేస్తున్నాడని వెల్లడైంది. దావూద్ లష్కరేతోయిబా, జైషే మహ్మద్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడని కూడా తేలింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి