
భాగ్యనగరం: హనుమకొండలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శనివారం సాయంత్రం జరుపతలపెట్టిన బహిరంగ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.
అయితే, సభకు పోలీసుల అనుమతి లేదన్న కారణంతో కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి రద్దు చేశారు. దీంతో బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. బహిరంగ సభకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్నారు.
శనివారం ఆర్ట్స్ కాలేజీలో పరీక్షలు ఉన్నందునే ప్రిన్సిపల్ సభ అనుమతి రద్దు చేశారని ఏజీ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కళాశాలకు ఒకటే ప్రవేశం ఉందని, సభ వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బీజేపీ సభకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో యథావిధిగా జరగనుంది. ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
Source: Nijamtoday