
-
బలవంతపు పెళ్ళితో అష్టకష్టాలు
-
చివరకు భర్త ఆచూకీ చెప్పని పాస్టర్, అత్తవారు
రాజమహేంద్రవరం: తన భర్త ఎక్కడున్నాడో తెలియచేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ రామకృష్ణ థియేటర్ పక్కవీధిలోని ఎఈఎల్‌సి చర్చి వద్ద మున్నింగి సత్యవతి అనే మహిళ బుధవారం దీక్ష చేపట్టింది.
పదేళ్ళ క్రితం తనకు జాకబ్ ప్రభు చరణ్‌తో పెళ్ళయిందని, మూడేళ్ల క్రితం తనను పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్ళారని అప్పటినుంచి జాకబ్ ప్రభు చరణ్ ఆచూకీ తనకు చెప్పకుండా అత్తింటి వారు ఇబ్బంది పెడుతున్నారని సత్యవతి బోరుమంది.
పెళ్ళి కాకముందు తనను.. పాస్టర్ నెల్లిపూడి నెల్సన్ నర్సింగ్ చదివించారని తరువాత తనకు ఉద్యోగం వచ్చిందని సత్యవతి చెప్పారు. ఆ సమయంలోనే పాస్టర్ నెల్సన్ కొడుకు మార్టిన్ లూథర్, కోడలు కేరీశా ప్రభు ప్రియ దంపతులు కలిసి కేరీశా సోదరుడు ప్రభుచరణ్‌ను వివాహం చేసుకోవాలని పదే పదే అడిగేవారని ఆమె చెప్పింది.
తాను ఒప్పుకోకపోవడంతో తన తల్లితండ్రులపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. పాస్టర్ నెల్సన్ తనను చదివించారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలని ఒత్తిడి చేయడంతో పెళ్ళికి అంగీకరించినట్టు సత్యవతి చెప్పింది.
పెళ్ళి అయిన తర్వాత అతడు మద్యానికి బానిస అని, ఉద్యోగం కూడా లేదని తెలిసిందన్నారు. తాగివచ్చి వేధింపులకు గురిచేసేవాడని సత్యవతి ఆరోపించారు. తాగుడికి బానిసైన వ్యక్తిని, కాపురం చేయనివాడినిచ్చి తనకు పెళ్ళి చేసి మోసం చేశారని ఆరోపించింది.
మూడేళ్ళ క్రితం తనను పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్ళారని, తాను ఎప్పుడు అత్తింటింకి వెళ్లినా జాకబ్ లేడని హైదరాబాద్లో ఉన్నాడని ఒకసారి, ఢిల్లీలో ఉన్నాడు, ముంబైలో, బెంగుళూరులో ఉన్నాడని మరోసారి చెప్పడం తప్ప అతడిని తనకు చూపించడం లేదని సత్యవతి వాపోయింది.
తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తన కుటుంబ సభ్యులతో సత్యవతి దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పలువురు మహిళలు, సత్యవతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.