న్యూఢిల్లీ: భారత దేశమంతటా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ కూటమి ‘ఐ2యూ2’ తొలి భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. వీడియో ద్వారా నిర్వహించిన సమావేశంలో- ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్ లాపిడ్, యూఏఈ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు.
నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో సంయుక్త పెట్టుబడులపై చర్చించారు. సభ్య దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాల్లో నెలకొన్న భారీ సవాళ్ళను అధిగమించేందుకు దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని యోచించారు. ముఖ్యంగా ఆహార సంక్షోభాన్ని అధిగమించడంపై, శుద్ధ ఇంధన ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై లోతుగా చర్చించారు. గుజరాత్‌లో బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ విధానంలో 300 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నెలకొల్పాలని నిర్ణయించారు.