
తిరుపతి: అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై తొమ్మిదో తేదీ వరకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఎనిమిది నగరాల్లో శ్రీనివాసుడి కల్యాణం నిర్వహించనున్నామని తిరుమలలో సుబ్బారెడ్డి ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలిసి మీడియా సమావేశంలో తెలిపారు. గత రెండున్నరేళ్ళుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు. ఆంధప్రదేశ్ ప్రవాసభారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీనివాసుడి కల్యాణోత్సవంలో భక్తులు ఉచితంగా కల్యాణంలో పాల్గొనవచ్చనని తెలిపారు.