
దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలకు చైనా ఆజ్యం పోస్తోంది. తాజాగా తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి 30 చైనా విమానాలు దూసుకెళ్లాయి.
ఈ ఘటన సోమవారం చోటు చేసుకొన్నట్లు తైవాన్ ప్రకటించింది. తైవాన్ పై చైనా దండెత్తితే తాము జోక్యం చేసుకొంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అదే రోజు అమెరికా అధికారులు తైవాన్‌ను సందర్శించారు.
ఇటీవల కాలంలో తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి తరచూ చైనా విమానాలు చొరబడుతున్నాయి. అవి కేవలం ట్రైనింగ్ డ్రిల్స్ మాత్రమే అని చైనా సర్దిచెప్పుకొంటోంది. ఫలితంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతన్నాయి. తాజాగా తమ ఎయిర్ డిఫెన్స్ జోన్ పరిధిలోకి వచ్చిన వాటిలో 22 ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానికి వార్ఫేర్, ఎర్లీవార్నింగ్, యాంటీ సబ్‌మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతాస్ ద్వీపానికి ఈశాన్యంగా ఈ చొరబాటు చోటు చేసుకొన్నట్లు వెల్లడించింది. ఈ విమానాలు ప్రాదేశిక గగనతలంలోకి మాత్రం చొరబడలేదని వివరించింది. గత ఏడాదిగా తైవాన్ ఈ రకమైన చొరబాట్లను ఎదుర్కొంటోంది. నిపుణులు దీనిని గ్రేజోన్ వార్ఫేర్‌గా అభివర్ణిస్తున్నారు. తైవాన్ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో విశ్లేషించేందుకు చైనా ఈ వ్యూహం అనుసరిస్తోంది.