News

జ్ఞానవాపీలోని శివలింగానికి పూజ‌లు చేసుకుంటాం… అనుమతి ఇవ్వండి

272views
  • కోర్టులో కాశీ విశ్వనాథ ఆలయం ప్రధాన పూజారి పిటిషన్‌

వార‌ణాసి: జ్ఞానవాపి మసీదులో ఇటీవల జరిగిన సర్వేలో శివలింగం వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు తేలడానికి సమయం పడుతుందని కోర్టు వెల్లడించిన నేపథ్యంలో కాశీ ఆలయ ప్రధాన పూజారి కులపతి త్రిపాఠి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ శివలింగం పరిసరాలను శుభ్రం చేసుకోవడంతోపాటు, పూజలు చేసేందుకు వీలుగా భక్తులను అనుమతించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ.. శివలింగం ఉన్న ప్రాంతం ఒక ఫౌంటెన్‌ అంటూ.. ముస్లింలు చేసిన వాదనను తిప్పికొట్టారు. ‘‘అది ఫౌంటెన్‌ కాదు.. గౌరి ఆలయంలో ఉత్తర భాగాన జ్ఞానవాపి ఉంది. ఉత్తరాన గోడ, పశ్చిమాన నంది విగ్రహం ఉన్నాయి. ఉత్తరంలో ఉన్న గోడకు వెనుక భాగంలో మూడు దుకాణాలు ఉండేవి. ఒక ముస్లిం మహిళ ఓ దుకాణంలో గాజులు విక్రయించేవారు. తర్వాత ఔరంగజేబు దాడులతో పరిస్థితులు మారాయి. ఆ సమయంలో పన్నా అనే పూజారి శివలింగంతో సహా బావిలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నారు’’ అని వివరించారు.

మసీదు గోడలను తొలగించాలని, అక్కడ 51 అడుగుల శివలింగం ఉన్న విషయాన్ని పరిశీలించాలని పిటిషన్‌లో వివరించినట్టు తెలిపారు. మసీదు గోడలను తొలగించినప్పుడే తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఆలయ స్తంభాలపైనే మసీదు కుడ్యాన్ని నిర్మించారని ఆరోపించారు. కాగా, జ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి తప్పుడు సందేశం ఇచ్చినట్టు అవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆదివారం కర్ణాటకలోని కలబురగిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ధార్మిక స్థలాల చట్టం-1991కి జ్ఞానవాపి వివాదంలో సుప్రీం తీసుకున్న నిర్ణయం భిన్నంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌ వారాణసీలోని జ్ఞానవాపీ మసీదు విషయంలో వివాదం రాజుకున్న వేళ జాతీయ మీడియా జీ న్యూస్‌ ఓ ఆసక్తికర ఫొటోను వెలుగులోకి తీసుకొచ్చింది.

జ్ఞానవాపీ కాంప్లెక్స్‌లో 154 ఏళ్ళ క్రితం (1868లో) బ్రిటిష్‌ ఫొటోగ్రాఫర్‌ శామ్యూల్‌ బౌర్న్‌ తీసిన ఫొటో ఇది. ఆ జ్ఞానవాపీ కాంప్లెక్స్‌లో నంది, హనుమంతుడి విగ్రహాలూ ఇందులో ఉన్నాయి. అలాగే, హిందూ మందిరాలకు సంబంధించిన కళాఖండాలూ ఉన్నాయి. మసీదు ఆవరణలో శివలింగం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి