
కశ్మీర్: నిన్న కశ్మీర్ పండిట్ రాహుల్ భట్‌ను, నేడు కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్‌ను బలితీసుకున్న ఉగ్రవాదులను నేడు భద్రతా దళాలు కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి.
అయితే, తప్పించుకునేందుకు ఎదురుకాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను హత్య చేసిన వారిగా పోలీసులు గుర్తించారు.
కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళన
అంతకుముందు జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బుద్గాంలోని చందూరాలో రాహుల్ భట్ అనే పండిట్ హత్యను నిరసిస్తూ కశ్మీరీ పండిట్లు రోడ్డెక్కారు. కశ్మీర్‌లో పండిట్లకు రక్షణ కరవైందని… తమకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బుద్గాంలో నిరసన ప్రదర్శన చేపట్టిన పండిట్లు.. స్థానిక ఎయిర్‌పోర్ట్ వైపు ర్యాలీగా కదిలారు.
దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా.. ఇరువరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో లాఠీచార్జి జరిపిన పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టారు. భాష్ప వాయువు ప్రయోగించారు. నిరసనకారులు తమపై రాళ్ళు రువ్వడం వల్లే లాఠీఛార్జి జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బుద్గాంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.