* అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి డిమాండ్
సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఐదు రోజుల క్రితం జరిగిన చందన యాత్రలో మూల విరాట్ ని వీడియో తీయడంపై అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ మండిపడ్డారు. ఈ ఘటనకు భాద్యులైన వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు నుంచి సామజిక మాధ్యమం ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన పలు అంశాలను తెలిపారు. సనాతన భారతీయ వైదిక సంప్రదాయంలో స్వయం భూ మూర్తుల దర్శనాన్ని కృత్రిమ నేత్రాల (వీడియోలు, ఫొటోలు తదితర వస్తువులు) ద్వారా ప్రకటించడం శాస్త్ర సమ్మతం, సంప్రదాయ సమ్మతం కాదని హెచ్చరించారు.
మనం సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో, పకడ్బందీగా పాటిస్తామని, అటువంటిది అత్యంత క్రమశిక్షణతో ఆలయ సంప్రదాయాలకు మేలుతునకగా ఉండే సింహచలంలోని ప్రముఖ పాంచరాత్రాగమ దేవలయంలోనే ఈ విధంగా సంప్రదాయాపచారం జరగడం అత్యంత తీవ్రవేదనను కలిగిస్తోందన్నారు.
ప్రస్తుత చందనోత్సవాల సందర్భంగా నిజరూప దర్శనాన్ని వీడియోలలో చిత్రీకరించడం వాటిని అనేక సామాజిక మాధ్యమాలలో ప్రసారం జరగడంపై సంఘం అత్యంత తీవ్రమైన ఆగ్రహాన్ని, నిరసనను తెలియజేస్తోంది. గత కొంత కాలంగా ఇటువంటి అనాచారాలకు దేవస్థానం వేదికగా మారుతోందని, ఇది సరైనది కాదని హెచ్చరిస్తోంది. అసలే కొంతమంది మన పాంచరాత్ర, వైఖానస ఆగమాలను నిర్వీర్యం చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులలో ఇటువంటివి వారికి బలాన్ని చేకూరుస్తాయని హెచ్చరించారు. ఈ ఘటనకు కారణమైన సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.