NewsProgramms

పుస్తకం చిన్నది – విషయం పెద్దది

944views

* “మనదే – మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభలో వక్తలు

శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి రచించిన “మనదే మనదే కాశ్మీరం” పుస్తకం అవటానికి చిన్నదే అయినా మంచి విషయమున్న పుస్తకమని ఆ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు.

“మనదే.. మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభ విజయవాడ అయోధ్యనగర్ లోని హైందవీ కార్యాలయంలో శనివారం (26/3/2022) నాడు జరిగింది.

కాశ్మీర్ యొక్క సుదీర్ఘమైన చరిత్రను, దురాక్రమణదారుల దాడులను, గత పాలకుల నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని, 370 ఆర్టికల్ అమలు వల్ల అందాల కాశ్మీరానికి జరిగిన నష్టాన్ని, 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సమగ్రంగా, సంక్షిప్తంగా, సమర్ధవంతంగా రచయిత ఈ గ్రంథంలో వివరించాడని వక్తలు తమ ప్రసంగాలలో పేర్కొన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణీ సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే పుస్తకాన్ని తక్కువ సమయంలో ఏకధాటిగా చదవగలిగేలా అనేక వివరాలతో అత్యంత సంక్షిప్త రూపంలో రచయిత శ్యాంప్రసాద్ రెడ్డి  ఈ పుస్తకాన్ని అందించాడని, అందుకు ఆయన అభినందనీయుడని తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ 400 పేజీలకు సరిపడిన సమాచారాన్ని కేవలం 40 పేజీలలో, ఎవరైనా చక్కగా చదివి అర్థం చేసుకోగల రీతిలో అందించిన శ్యాంప్రసాద్ రెడ్డి అభినందనీయుడని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు అనంతరం తాను 10 రోజులపాటు కాశ్మీర్లో పర్యటించానని తెలుపుతూ ఆయన వెల్లడించిన ఆ పర్యటన వివరాలు సభికులను ఆకట్టుకున్నాయి. 370 ఆర్టికల్ రద్దును, అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధిని అత్యధిక శాతం కాశ్మీరీలు స్వాగతిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ భరత్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ సమస్యపై కొంతమంది అసత్య ప్రచారాలు చేసి అదే నిజమని నమ్మిస్తూ వచ్చారని, అయితే నేడు 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ కు సంబంధించిన అనేక వాస్తవాలు అనేక రూపాలలో దేశ ప్రజలకు తెలుస్తున్నాయని తెలిపారు. ఉజ్వల పరంపరకు, చరిత్రకు, ఉత్థాన పతనాలకు, రక్త చరిత్రకు, నేడు 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ పరుగులు తీస్తున్న అభివృద్ధికి సాక్షీభూతంగా నిలచిన అందాల కాశ్మీరం యొక్క వివరాలను ఈ చిన్ని పుస్తకంలో వీలైనంత సమగ్రంగా అందించే ప్రయత్నాన్ని రచయిత చేశాడని శ్రీ భరత్ కుమార్ తెలిపారు. శ్యాంప్రసాద్ రెడ్డి కలం నుంచి ఇలాంటి పుస్తకాలు మరెన్నో వెలువడాలని ఆయన ఆకాంక్షించారు.

రచయిత శ్యాంప్రసాదరెడ్డి మాట్లాడుతూ నేడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా వాస్తవాలకు అద్దంపట్టిందని, కాశ్మీర్లులో జరిగిన అనేక సంఘటలనలకు చిత్ర రూపం ఇచ్చారని తెలిపారు. కాశ్మీర్ మారణహోమంలో వేలాది మంది మరణించారని, ఐదు లక్షలమంది తమ ఇళ్ళు, ఆస్తులను వదులుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని కాశ్మీర్ విడచి పారిపోయారని గుర్తు చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికిల్ రద్దు చేయడంతో నేడు కాశ్మీర్ ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తాను ఈ పుస్తకం వ్రాయడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ పుస్తకాన్ని Hindu e shop ద్వారా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.