News

గాంధీలు స్వయంగా వైదొలగాలి: సిబల్‌

438views

త్తర్‌ప్రదేశ్‌ సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత భగ్గుమంటున్నాయి!

పార్టీలో ‘గాంధీ’ల నాయకత్వం కొనసాగుతుండటంపై సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. వారు వైదొలగి, ఇతర నేతలకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ పార్టీగా కాకుండా అందరి పార్టీగా కాంగ్రెస్‌ ఉండాలని అభిలషించారు. సిబల్‌ వ్యాఖ్యలపై పార్టీలోని పలువురు నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన ఆరెస్సెస్‌/భాజపా భాష మాట్లాడుతున్నారంటూ నిందించారు. మరోవైపు- పార్టీలో ప్రక్షాళన కోరుతూ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 2020లో లేఖ రాసిన జి-23 బృందం నేతలు తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

సిబల్‌ తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. ”కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం ఉంది. రాహుల్‌ పార్టీకి అధ్యక్షుడు కాదు. అయినప్పటికీ ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్‌ పంజాబ్‌కు వెళ్లి.. చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఏ హోదాలో ఆయన ఆ ప్రకటన చేశారు? పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగడంపై కార్యకర్తలు సంతోషంగా లేరు. ‘గాంధీలు’ నియమించిన నేతలే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఉన్నారు. నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని ఆ నేతలు వారికి చెప్పలేరు. కాబట్టి ‘గాంధీలు’ స్వయంగా పక్కకు తప్పుకొని, పార్టీని నడిపించే అవకాశం వేరే నేతకు ఇవ్వాలి. నేను ‘అందరి కాంగ్రెస్‌ (సబ్‌కా కాంగ్రెస్‌)’ను కోరుకుంటున్నాను. కొంతమంది ‘కుటుంబ కాంగ్రెస్‌ (ఘర్‌కా కాంగ్రెస్‌)’ కావాలనుకుంటున్నారు” అని పేర్కొన్నారు.

‘పార్టీని నాశనం చేసేందుకే..’

సిబల్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలో కాంగ్రెస్‌ విప్‌ మాణికం ఠాగూర్‌ మండిపడ్డారు. ”కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీలు వైదొలగాలని ఆరెస్సెస్‌, భాజపా కోరుకుంటున్నాయి. ఎందుకంటే- వారు పక్కకు తప్పుకొంటే కాంగ్రెస్‌.. జనతా పార్టీలా తయారవుతుంది. అప్పుడు పార్టీని పూర్తిగా నాశనం చేయడం సులువవుతుందన్నది వారి యోచన. ఈ విషయం సిబల్‌కు కూడా తెలుసు. అయినప్పటికీ ఆయన భాజపా/ఆరెస్సెస్‌ భాషలో ఎందుకు మాట్లాడుతున్నారు?” అని ట్విటర్‌ వేదికగా ఠాగూర్‌ విమర్శించారు. సిబల్‌ వ్యాఖ్యలు దురదృష్టకరమని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు.

ఇతర నేతలకూ ‘జి-23’ ఆహ్వానం

కాంగ్రెస్‌లో తాజా పరిస్థితులపై చర్చించేందుకుగాను దిల్లీలో కపిల్‌ సిబల్‌ నివాసంలో బుధవారం భేటీ కావాలని జి-23 బృందంలోని నేతలు నిర్ణయించుకున్నారు. తమ బృందంలో సభ్యులుగా లేనప్పటికీ, పార్టీ నాయకత్వంలో మార్పులు కోరుకుంటున్న స్వపక్ష నాయకులు ఈ సమావేశానికి హాజరుకావొచ్చని ‘జి-23’ తెలిపినట్లు సమాచారం.

– ఈనాడు సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.