News

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు

345views
  • ప్ర‌క‌టించిన రష్యా రక్షణ శాఖ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని రష్యా తెలిపింది. ఖార్కివ్‌ నగరం నుంచి భారతీయులు వెళ్ళిపోకుండా ఉక్రెయిన్‌ యంత్రాంగం అడ్డుకుంటోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. భారతీయులను ఉక్రెయిన్‌ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్టు తెలిపింది.

అయితే, భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ఈ ఆరోపణలను ఖండించారు. రక్తమోడుతూ కూడా ఉక్రెయిన్​.. విదేశీ పౌరులు దేశం దాటేందుకు సహకరిస్తోందని చెప్పారు. తనకు తెలిసి భారతీయులు ఖార్కివ్‌ నగరాన్ని ఖాళీ చేసి పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్టు ఆయన తెలిపారు. భారత్ సహా విదేశీ విద్యార్థుల కోసం హాట్‌లైన్‌ ఏర్పాటు చేసినట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

అలాంటిదేం లేదు..

ఉక్రెయిన్​లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న వార్తలపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని, ఉక్రెయిన్‌లోని ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేసింది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు బుధవారం ఖార్కివ్ నుంచి బయలుదేరారని చెప్పింది. ఈ విషయంలో తోడ్పాటు అందిస్తున్నందుకు ఉక్రెయిన్ అధికారులు, సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి