ArticlesNews

తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు

1.2kviews

క్రైస్తవులుగా మతం మారిన వారిని సోషల్ మీడియా తదితర మాధ్యమాలలో కొందరు తరచుగా గొఱ్ఱెలని సంబోధిస్తూ ఉండడం కనిపిస్తోంది. వారేం పాపం చేశారని వారినలా పిలుస్తున్నాం? అసలు మనకేం అర్హతుందని వారినలా నిందిస్తున్నాం? అలా అవమానించి ఎందుకు హిందూ సమాజానికి వారిని మరింత దూరం చేస్తున్నాం? ఇంతకీ వారిని మన ధర్మంలోనే నిలిపి ఉంచుకోవడానికి, వెళ్ళినవారిని తిరిగి తెచ్చుకోవడానికి మనమేం ప్రయత్నం చేశాం?

ఒక పెద్దాయన్ని అనారోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారి అబ్బాయి చేర్పించాడు. వారి బెడ్ దగ్గరకు ఒక పాష్టర్ వచ్చి “ప్రార్ధన చేస్తాను… తలకింద బైబిల్ పెట్టుకో… నీకు వచ్చిన రోగం త్వరగా తగ్గిపోతుంది” అని చెప్పాడు. వారి అబ్బాయి, ఆ పెద్దాయన ఇద్దరూ వద్దు పొమ్మన్నారు. అయినా ఆ పాష్టర్ విడిచిపెట్టలేదు. రోజూ వస్తూనే ఉన్నాడు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

కొన్ని రోజులకు ఆ పెద్దాయన ఆలోచన మారింది. ఏ పుట్టలో ఏ పాముందో…. ప్రయత్నించి చూద్దామనుకున్నాడు. పాస్టర్ చెప్పినట్లుగా ప్రార్థన చేయించుకుని బైబిల్ తలకింద పెట్టుకున్నాడు. తెల్లవారేసరికి ఆ పెద్దాయనకి హుషారు వచ్చినట్లు అనిపించి వాళ్ళ అబ్బాయి రాగానే “నాకు చాలా వరకు తగ్గిపోయింది. పాస్టర్ చెప్పినట్లుగా తలకింద బైబిల్ పెట్టుకున్నాను” అని సంతోషంగా అబ్బాయికి చెప్పాడు. అబ్బాయికి అనుమానం వచ్చింది. ఆ రాత్రి వాళ్ళ నాన్న గారికి ఏ మందులిచ్చారో చెప్పమని నర్సును గట్టిగా బెదిరించాడు. అప్పుడు అసలు విషయం బైటకొచ్చింది. పాస్టర్ ప్రార్థన చేసిన తరువాత వారి మాయలో భాగంగా… సదరు నర్సు ఆ రాత్రి ఆయనకు స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చింది. నిజానికి చివర దశలో ఉన్నవారికి ఇవ్వవలసిన ఇంజక్షనది. అవసరం లేనివారికి ఆ ఇంజక్షన్ ఇస్తే బాడీలోని కొన్ని భాగాలు త్వరగా దెబ్బతింటాయి. కానీ తాత్కాలికంగా కొద్దిసేపు మనిషి హుషారు వచ్చి ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఫీలవుతారు. అమాయకులను మతం మార్చటానికి పాష్టర్లకి ఆ గ్యాప్ చాలు. చదువుకున్నవారే క్రైస్తవ మతమార్పిడి మాఫియా కుట్రలకు ఆ విధంగా భోల్తా పడిపోతూ ఉంటే ఇక అమాయకుల పరిస్థితేమిటి ? ఇక్కడ మీకు ఆ పాష్టరు గాడి మోసం కనుబడుతున్నదేమో గానీ నాకు మాత్రం వాడి పట్టుదల కనిపిస్తోంది. మన వారిని మన ధర్మంలోనే నిలిపి ఉంచుకోవడానికి, ఏదో కారణం వల్ల వీడి వెళ్ళినవాళ్ళని తిరిగి మన ధర్మంలోకి తెచ్చుకోవడానికి మనం కూడా అంతే తీవ్రంగా, ఆర్తిగా, పట్టుదలగా ఏనాడన్నా ప్రయత్నించామా?

నిజానికి మతం మారారంటే…. వారి అమాయకత్వం అది. వారికి మంచీచెడూ వివరించి చెప్పేవాళ్ళు లేరిక్కడ. ఆదరించేవాళ్ళు లేరు. ఖర్చుతో కూడుకున్న పూజా విధానమే తప్ప, సరళమైన పూజా విధానం నేర్పేవారు లేరు. కష్టకాలంలో పలుకరించి, ఓదార్పును, స్వాంతనను చేకూర్చేవాళ్ళు లేరు. అవతలివాడు ఊదరగొడుతున్నాడు. చెవినిల్లుగట్టుకుని పోరుతున్నాడు. మతం మారితే నీకంతా మంచే జరుగుతుందంటూ ఊరిస్తున్నాడు. తృణమో, ఫణమో ముట్టజెబుతున్నాడు. మతం మారాకెలాగూ దశమభాగం పేరుతో వాడిదగ్గరెలాగూ అంతకంత గుంజుతాడనుకోండి…. అది వేరే విషయం. వాడికి ఆరోగ్యం బాగోకపోతే ప్రార్థనలు చేస్తున్నాడు. ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. ఇలా అనేకానేక ప్రయత్నాల తర్వాతనే అమాయకులు వారి వలలో చిక్కుతున్నారు. ఈ మధ్యలో మనం వాడిని ఒక్కసారి కూడా పలుకరించి ఉండం. వాడి కష్టం తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేసుండం…. ఒక్కరైనా ఒక్కసారైనా పలుకరించుంటే, వాడి కష్టం తెలుసుకుని ఓదార్చి ఉంటే, వాడి కష్టం తీర్చే ప్రయత్నమేదన్నా చేసుంటే వాడు ఖచ్చితంగా మతం మారుండేవాడు కానే కాదు.

ఇప్పుడు కూడా చూడండి…. SSF రూపంలోనో, ధర్మజాగరణ సమితి రూపంలోనో ఎవరైనా వెళ్లి అలా పలుకరించగానే…. వారు పులకరించిపోతున్నారు. కన్నీరు కారుస్తూ చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతూ తిరిగి అమ్మ ఒడి చేరడానికి ఉబలాటపడుతున్నారు. తిరిగి రావాలనున్నా రాలేక, ఎలా రావాలో తెలీక సతమతమవుతున్నవారూ ఎందరో ఉన్నారు. మనం మాత్రం వారిని గొఱ్ఱెలు, బఱ్ఱెలంటూ అవమానించి మరింత దూరం చేసుకుంటున్నాం. వారందరూ మన సోదరులే…. రేపో మాపో మన ఇళ్లు (వారి సొంత ఇంటికి) చేరవలసినవారే. మనం సదా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అందుకై వారికి అన్ని విషయాలనూ ఓపిగ్గా వివరించాలి. వారు వినరు, వాదిస్తారు, గొడవ కూడా పెట్టుకుంటారు, దుర్భాషలాడతారు, అవకాశముంటే ఇబ్బందులకు కూడా గురిచేస్తారు. ఇన్నాళ్ళూ చర్చిలలో వాళ్ళకి ఆ మౌఢ్యాన్ని, అజ్ఞానాన్ని, వారి మాతృధర్మం పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. ఆ మత్తులో, మాయలో ఉన్నారు వారు. ఆ మాయ తెరలను మనం ఓపిగ్గా తొలగించాలి. చైతన్యవంతులను చెయ్యాలి. అందుకు కావలసింది వారిపట్ల మనకు అపారమైన ప్రేమ, కరుణ, ఆత్మీయత, బంధుభావన… అంతేతప్ప తక్కువ భావన కాదు. అవమానించడం కాదు, అవహేళన చెయ్యడం కాదు. వారు గొఱ్ఱెలు కాదు. తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు. మనవారే… మన సోదరులే వాళ్ళు. వారిని తిరిగి మన సింహం గూటిలోకి తెచ్చుకుందాం. మన చిట్టచివరి సోదరుడు సైతం తిరిగి మన చెంత చేరేవరకూ మనం అవిశ్రాంతంగా, అలసిపోకుండా ప్రయత్నిస్తూనే ఉందాం… భారత్ మాతాకీ జయ్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.