News

4 ఏళ్ళ‌లో 3,100 మందికి భారత పౌరసత్వం

361views
  • కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్

న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన 3,100 మందికి పైగా భారతీయ పౌరసత్వం పొందినట్టు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం పార్లమెంటుకు వివ‌రించారు.

గత నాలుగేళ్లలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ సమూహాల నుండి ప్రభుత్వం 8,200 పౌరసత్వ దరఖాస్తులను స్వీకరించిందని రాజ్యసభలో ఒక ప్రశ్నకు నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

భారత పౌరసత్వం కోసం 7,306 మంది పాకిస్థానీయులు దరఖాస్తు చేసుకున్నారని.. ఈ ఏడాది డిసెంబర్‌ 14 వరకు భారతీయ పౌరసత్వం కోసం 10,635 దరఖాస్తులు అందినట్టు నిత్యానంద రాయ్ పార్లమెంటుకు తెలిపారు. ఇందులో సుమారు 70 శాతం దరఖాస్తులు పాకిస్థాన్‌ జాతీయులకు చెందినవని చెప్పారు.

భారత పౌరసత్వం కోసం ప్రస్తుత దరఖాస్తుదారుల వివరాలు, వారి ప్రస్తుత పౌరసత్వం డేటాను కోరుతూ ఎంపీ అబ్దుల్ వహాబ్ అడిగిన ప్రశ్నకు రాయ్ సమాధానమిచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి 1,152, అమెరికా నుంచి 428, శ్రీలంక నుంచి 223, నేపాల్ నుంచి 189, బంగ్లాదేశ్ నుంచి 161, చైనా నుంచి 10 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

శరణార్థులతో సహా విదేశీ పౌరులందరూ విదేశీయుల చట్టం, 1946, విదేశీయుల రిజిస్ట్రేషన్ చట్టం, 1939, పాస్‌పోర్ట్ (భారతదేశంలోకి ప్రవేశం) చట్టం, 1920, పౌరసత్వ చట్టం, 1955లో ఉన్న నిబంధనల ద్వారా నియంత్రించబడతారని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లలో 4,177 మందికి పైగా భారతీయ పౌరసత్వం పొందారని ఎగువ సభలో అడిగిన ప్రత్యేక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి