ArticlesNews

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ……

619views

క చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్న వీర వనిత ఝాన్సీ లక్ష్మి బాయి. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రధమ స్వాతంత్ర్య శంఖారావం చేసిన వీర నారి. యుద్ధ రంగంలో అపర కాళిలా విజృంభించి శత్రు సైనికులను చీల్చి చెండాడిన ధీశాలి.

ఆంగ్లేయ సింహాసనాలను అల్లల్లాడించిన పరాక్రమము, దేశభక్తి కలబోసి రూపొందిన ఆమె జీవితాన్ని గురించి కొంత తెలుసుకుందాం. 1835 నవంబర్ 19 న ఝాన్సీ లక్ష్మి జన్మించింది. 1842లో ఝాన్సీ రాజు గంగాధర రావుతో వివాహం జరిగింది. దాంతో ఒక పేద బ్రాహ్మణ బాలిక ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా మారిపోయింది. ఝాన్సీ ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా కేంద్ర పట్టణం.

1851 వ సంవత్సరంలో మహారాణి లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. రాణి దురదృష్ట వశాత్తు మూడు నెలల లోపునే ఆ బాలుడు చనిపోయాడు. ఆనందరావు అనే బాలుడిని దత్తత చేసుకున్నారు. తర్వాత గంగాధరరావు కూడా కాలం చేశాడు. రాజ్యపు బాధ్యత లక్ష్మీబాయిపై పడింది. దత్తత ద్వారా వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం గంగాధరరవుకి, లక్ష్మీబాయికి లేదంటూ బ్రిటిష్ ప్రభుత్వం, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చెయ్యాలని నిశ్చయించింది. కానీ రాణీ లక్ష్మీబాయి అందుకు తిరస్కరించింది.

రాణి దినచర్యలో మార్పు వచ్చింది. గుర్రపు స్వారీ చేసేది, తుపాకీ, ఖడ్గం, బల్లెం ప్రయోగించడం నేర్చుకునేది. “అత్యాచారాలు, అన్యాయాలను మౌనంగా సహించేవారు మరణించిన వారితో సమానం. న్యాయాన్ని గౌరవించడమే నీతి. అన్యాయం ముందు తల వంచడం పిరికితనమే” అనేది.  స్వాతంత్ర్య వీరుడు తాంత్యాతోపెతో బ్రిటీషు వారిని ఎదిరించే విషయమై ఝాన్సీ లక్ష్మి నిరంతరం రహస్య మంతనాలు జరిపింది. 1857 ఏడు మే 31వ తేది ఆదివారం దేశమంతటా ప్రజలు ఒకేసారి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయం జరిగింది. 19,20 నెలల పాటు పోరాటం సాగుతూనే వుంది.  అయితే ఈ పోరాటం విషయం కొన్ని కారణాల వల్ల ముందుగానే పసిగట్టిన ఆంగ్లేయ ప్రభుత్వం ఆ మహా ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అణచివేయడంతో మూకుమ్మడి పోరాటం ద్వారా బ్రిటిష్ వారికి ఊపిరి సలపకుండా చేసి దేశం నుంచి తరిమివెయ్యాలనే దేశ భక్తుల ప్రయత్నం విఫలమైంది. బానిసత్వంలో  మ్రగ్గుతున్న జాతి తన స్వాతంత్ర్యం కోసం చేసే పోరాటంలో ఎన్ని సార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చినా తన ప్రయత్నాలు మానుకోవలసిన పని లేదు. సజీవ సమాజ లక్షణం పోరాడుతూనే ఉండడం. అదే ఒక రకంగా గొప్ప గౌరవప్రదమైన విషయం.

1858 మార్చ్ 23న బ్రిటీష్ సైన్యాధికారి సర్ రోజ్ ఝాన్సీపై యుద్ధం ప్రకటించాడు. 10,12 రోజుల వరకూ చిన్న రాజ్యమైన ఝాన్సీ గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ వచ్చింది. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడం రాణి గమనించింది. ఝాన్సీ నుండి బయటకు దూసుకుపోయింది. అక్కడి నుండి కాల్పికి చేరి తాంత్యా తోపె, రావు సాహెబ్ లను కలుసుకుంది.

కాల్పీలో కూడా రాణి సైన్యాన్ని సమీకరించింది. రోజ్ తన సైన్యంతో కాల్పీని ముట్టడించాడు. ఓటమి తప్పదని రాణికి అర్ధమైంది. వెంటనే రావు సాహెబ్, తాంత్యా తోపె మరి కొందరు యోధులు రాణితో కలిసి గ్వాలియర్ కోటని వశ పరచుకొన్నారు. తెల్ల వారు ఝామున గ్వాలియర్ కోటను ముట్టడించారు. రాణి పురుష వేషం ధరించి యుద్ధానికి సిద్ధమైంది.

రాణి వద్ద సైన్యం సంఖ్యా పరంగా తక్కువే ఉన్నప్పటికీ సర్దారుల అసాధారణ సాహసం, యుద్ధ వ్యూహం, రాణి పరాక్రమం కారణంగా ఆ రోజు ఆంగ్లేయ సైన్యం భారీగా దెబ్బ తింది. మరునాడు కొందరు సైనికులు ఆంగ్లేయులతో చేయి కలిపారు. రాణి లక్ష్మీ బాయి తన సర్దారులతో  “నేడు యుద్ధానికి చివరి రోజేమోననిపిస్తోంది. ఒకవేళ నేను మరణిస్తే నా కుమారుడు ఆనంద రావు జీవితాన్ని నా జీవితం కంటే విలువైనదిగా పరిగణించాలి.అతనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యాలి.” అంది. “నేను మరణించిన తర్వాత నా శవం విధర్మీయుల చేతుల్లో పడరాదు”. అని కూడా ఆమె కోరింది.

రోజ్ వద్ద సైనిక శక్తి అధికంగా వుంది. విప్లవకారుల సైన్యం వారి ముందు నాశనమైపోయింది. రాణికి తప్పించుకుని పోవడం మినహా మరొక మార్గం కనిపించటం లేదు. ఆమె ముందుకి దూకింది. ఆంగ్లేయుల సైన్యం ఆమెను చుట్టుముట్టింది. రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి.రాణి చెయ్యి ఒకటి తెగి పడింది. కడుపులో నుంచి రక్తం కారుతోంది. ఒళ్లంతా గాయాలయ్యాయి. కళ్ళు బైర్లు క్రమ్ముతున్నాయి. ఆమె దురవస్థని చూచి ఆమె అంగ రక్షకుడైన కుల్ మొహమ్మద్ కూడా విలపించసాగాడు. రాణిని భుజానికి ఎత్తుకుని గంగాదాస్ ఆశ్రమం వైపుకి పరుగు తీశాడు.

ఆ రోజు జూన్ 28, 1858. చుట్టూ చిమ్మ చీకటి. ఆ చీకట్లోనే బాబా గంగాదాస్ రక్తసిక్తమైన రాణి ముఖాన్ని గుర్తు పట్టాడు. చల్లని నీటితో ఆమె ముఖాన్ని కడిగాడు. గంగా జలం త్రాగించాడు. రాణికి కొద్దిగా స్పృహ వచ్చింది. వణుకుతున్న కంఠంతో ఒక్క సారి “హర హర మహాదేవ్” అని మాత్రం అంది. ఆ తర్వాత ఆమె శరీరం తిరిగి చైతన్యాన్ని కోల్పోయింది. కొద్ది సేపటి తర్వాత అతి కష్టం మీద మళ్ళీ ఆమె కన్నులు తెరిచింది. బాల్యంలో తాను నేర్చుకున్న భగవద్గీత శ్లోకాలను నెమ్మదిగా ఉచ్ఛరించింది. ఆమె కంఠస్వరం  అంతకంతకూ క్షీణించ సాగింది. ” ఓ కృష్ణా నీ ముందు నేను ప్రణమిల్లుతున్నాను.” ఇవే ఆమె చివరి మాటలు. ఝాన్సీ రాజ్యపు భాగ్య రేఖ అంతరించింది.

బాబా గంగా దాస్ ఇలా అన్నాడు. “వెలుతురుకు అంతం లేదు. ప్రతి కణంలోనూ అది దాగి వుంటుంది. తగిన సమయంలో అది తిరిగి ప్రకాశిస్తుంది. రాణి పార్ధివ శరీరం అక్కడే అగ్ని జ్వాలలకు ఆహుతి చెయ్యబడింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కేవలం భారత దేశానికే కాక మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికే వన్నె తెచ్చిన వీర నారీమణి. అమెది పవిత్ర జీవితం. పరిపూర్ణ నారీత్వం. సాహసం, అమర దేశభక్తి, బలిదానాల ఉత్తేజ గాథే ఆమె జీవితం.

ఆదర్శపత్నిగా వ్యవహరించింది. భర్త మరణంతో జీవితం మీద విరక్తి కలిగినా తన కర్తవ్యాన్ని మాత్రం ఆమె విస్మరించలేదు. ఆమె నిష్టావంతురాలైన హిందువు. మిగిలిన మతాల విషయంలో పూర్తి సహిష్ణుత కలిగివుండేది. ఆమె ఏ యుద్ధానికి బయలుదేరినా హిందువులతోబాటు, ముస్లిములు కూడా ఆమె సైన్యం ముందుండేవారు. రాణితో అనేక సార్లు యుద్ధంలో ఓడిపోయి చివరికి ఆమెను ఓడించిన సర్ రోజ్ రాణి లక్ష్మీబాయి గొప్పతనాన్ని గురించి ఇలా అన్నాడు. “విప్లవకారులదరిలో అత్యంత సాహసి, అందరికంటే గొప్ప సేనాపతి రాణి లక్ష్మీబాయి.” అని కొనియాడాడు.

ఝాన్సీ లక్ష్మీబాయి భారత దేశం గాఢ అంధకారంలో ఉన్నప్పుడు ఒక మెరుపులా ప్రకాశించి మాయమైన వీర వనిత. ధైర్య సాహసాలు, సంఘటనా కౌశలం, దేశ భక్తిని ప్రదర్శించి అమరురాలైన ఝాన్సీ లక్ష్మీబాయి కోట్లాది భారతీయుల హృదయాలలో నిత్యమూ ప్రేరణా జ్యోతులను వెలిగించే అమర జ్యోతి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.