
లక్నో: యూపీలోని ప్రయాగరాజ్‌లో నిర్వహించిన ర్యాలీలో కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించినందుకు అసదుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తాము ఓవైసీ ర్యాలీకి కేవలం వంద మంది పాల్గొనేందుకు అనుమతి ఇవ్వగా పెద్దసంఖ్యలో ప్రజలను అనుమతించారని, ఇది కొవిడ్-19 నిబంధనల ఉల్లంఘనేనని జిల్లా అధికారులు తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ శనివారం ప్రయాగరాజ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇక యూపీలో ఓవైసీ సభలకు సంబంధించి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదవడం ఇది మూడవసారి. మరోవైపు ప్రయాగరాజ్ ర్యాలీలో జైలులో ఉన్న మాఫియా డాన్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య పర్వీన్ పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడం, జాతీయ జెండాను అగౌరవపరచడం వంటి ఆరోపణలపై అసదుద్దీన్ పై కేసులను ఉత్తరప్రదేశ్ పోలీసులు బుక్ చేశారు. ఓ బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగం కారణంగా సెప్టెంబర్ 9 న బారాబంకి నగర పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తుందని ఓవైసీ ఇంతకు ముందు ప్రకటించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 38 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. కానీ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది. ఆ దెబ్బతో ఉత్తర ప్రదేశ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. అయితే ఓవైసీ అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు.
Source: Nationalist Hub