
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అస్సాంలోని కాచర్ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఈ మధ్యాహ్నం స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొందరు కాల్పులు జరపడంతో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్టు సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. మిజోరం సరిహద్దుల నుంచి జరిపిన కాల్పుల్లోనే వారు మృతిచెందినట్లు ఆరోపించారు. ఈ కాల్పుల్లో అస్సాంలోని కాచర్ జిల్లా ఎస్పీ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ సైతం తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
సరిహద్దుల వివాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఘర్షణల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు. ఉదయం నుంచే సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. తొలుత మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా.. సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ అమిత్ షాను ట్యాగ్ చేశారు. ‘అస్సాం మీదుగా మిజోరంకు వస్తున్న ప్రజలపై అక్కడివారు దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలను ఎలా సమర్థించుకుంటారు?’ అని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. దీనిపై జోక్యం చేసుకుని, ఈ దాడులను అరికట్టాలని అమిత్ షాను కోరారు.
అయితే, ఈ ట్వీట్‌కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. ‘జోరంతంగా జీ.. సరిహద్దుల్లో మా భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని కోలాసిబ్ (మిజోరం) ఎస్పీ అన్నారు. అప్పటిదాకా అక్కడి ప్రజలు ఈ హింసను ఆపబోమని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేం ప్రభుత్వాన్ని నడిపేదెలా?’ అని ప్రశ్నించారు. దీనిపై మిజోరం సీఎం బదులిస్తూ.. ఈ ఘర్షణలకు అస్సాం పోలీసులే కారణమని ఆరోపించారు. వైరాంగ్తే గ్రామంలోని ఆటో స్టాండ్‌పై అస్సాం పోలీసులు దాడి చేసి లాఠీ ఛార్జ్ చేశారని, భాష్పవాయువు కూడా ప్రయోగించారని దుయ్యబట్టారు.
కాగా.. రెండు రోజుల క్రితమే సరిహద్దు వివాదాలపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. అస్సాం, మిజోరం కొన్నేళ్ల నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. గత నెలలో కూడా రెండు రాష్ట్రాల భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చెలరేగింది.





