News

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారీగా పెరిగిన చైనా సైనికుల కదలికలు… అప్రమత్తమైన భారత సేనలు..

471views

రిహద్దుల్లో తన దుందుడుకు చర్యలను చైనా కొనసాగిస్తోంది. చైనా సైన్యం ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచింది. ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల విరామం తర్వాత చైనా సైన్యం కదలికలు కనిపించాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చెందిన సుమారు 40 దళాలు ఇటీవల బారాహోటి ప్రాంతంలో ఎల్‌ఏసీకి ఆవల గస్తీ నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలి కాలంలో ఎల్‌ఏసీ వెంబడి పరిణామాల నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో అక్కడి సెంట్రల్‌ సెక్టార్‌లో చైనా తన సైనిక కార్యకలాపాలను మరింత పెంచవచ్చని అనుమానిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి. బారాహోటి సమీపంలోని తమ వైమానిక స్థావరం వద్ద కూడా సైనిక కార్యకలాపాలను చైనా పెంచినట్లు తెలిపాయి. అక్కడి నుంచే డ్రోన్లు, హెలికాప్టర్లను డ్రాగన్‌ సైన్యం ప్రయోగిస్తున్నట్లు వివరించాయి. బారాహోటిని తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా పలుమార్లు అతిక్రమణలకు పాల్పడింది. లద్దాఖ్‌ మాదిరి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు గతేడాది ఇదే సెక్టార్‌లో భారత్ దళాలను మోహరించింది. సెంట్రల్‌ సెక్టార్‌లోనూ అదరపు బలగాలను మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.