News

క్రొత్త వేరియంట్లనూ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి – కేంద్రం

346views

దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా రకంపై కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా బయటపడుతోన్న రకాల వ్యాప్తి, తీవ్రతను బట్టి వాటిని వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్ గా విభజిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం దీన్ని వేరియంట్‌ ఆఫ్ ఇంట్రస్ట్ గానే పరిగణిస్తున్నామని.. దాని తీవ్రతను బట్టి రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇక తాజాగా జరిపిన అధ్యయనంలో డెల్టా రకంపై స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ కూడా అత్యధిక ప్రభావశీలత చూపించిందని ఆ వ్యాక్సిన్ ‌ని తయారుచేసిన గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది.

80దేశాల్లో డెల్టా వేరియంట్‌…

భారత్ ‌తో పాటు దాదాపు 80దేశాల్లో డెల్టా వేరియంట్‌ వ్యాపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. ప్రస్తుతం కొత్తగా వెలుగు చూసిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అమెరికా, బ్రిటన్‌, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌, జపాన్‌, పోలాండ్‌, నేపాల్‌, చైనా, రష్యాతో పాటు భారత్ ‌లో బయటపడిందని తెలిపారు. ఇప్పటివరకూ భారత్ ‌లో 45వేల నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్ చేపట్టగా.. 22 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు గుర్తించామన్నారు. కోవిడ్ వేరియంట్లను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన INSACOG ఆధ్వర్యంలో ఉన్న 28 ప్రయోగశాలల ద్వారా వీటి తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు.

3 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం…

ఇప్పటివరకు దేశంలో మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్ ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది మహారాష్ట్రలోని రత్నగిరి, జల్‌గావ్‌, ముంబయిలో వెలుగులోకి రాగా… కేరళలో మూడు కేసులు, మధ్యప్రదేశ్‌లో ఒక కేసు బయటపడినట్టు తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా ఆ మూడు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేయడంతో పాటు టెస్టింగ్‌, ట్రాకింగ్ ‌ను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉంటే, డెల్టా ప్లస్‌ వేరియంట్ ‌తో మహారాష్ట్రలో మూడోముప్పు పొంచి ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.