భారత్‌తో ‘శాంతి వారధుల’ను నిర్మించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె పేర్కొన్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలను పాక్ చేపడితే పరస్పరం విశ్వాసాన్ని నెలకొల్ప డానికి ఉపయోగపడతాయని తెలిపారు. కాల్పుల విరమణ ఎంత కాలం సాగుతుందన్నది పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆయన నియంత్రణ రేఖ వెంబడి భద్రతను సమీక్షించారు.
ఉగ్రవాదం, కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొంటూనే అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను కొనసాగిస్తున్నందుకు బలగాలను అభినందించారు. ‘‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ గౌరవించినంత కాలం మేం కూడా మా తుపాకులకు పనిచెప్పబోం’’ అని స్పష్టంచేశారు. ఆయుధ గర్జన ఆగినప్పటికీ తమ పోరాట సన్నద్ధతలో ఎలాంటి ఉదాసీనత ఉండబోదన్నారు. సరిహద్దు అవతల ఉగ్రవాద శిబిరాలు ఇంకా కొనసాగుతుండటమే ఇందుకు కారణమని చెప్పారు. ‘‘భారత్, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా అపనమ్మకం ఉంది. అందువల్ల రాత్రికి రాత్రే పరిస్థితి మారబోదు. భారత్‌లో విద్రోహ చర్యలకు పాక్ స్వస్తి పలకడాన్ని కొనసాగిస్తే చిన్నచిన్న అడుగులూ విశ్వాసాన్ని పాదుగొల్పుతాయి’’ అని చెప్పారు. ముప్పు పరిస్థితిని బట్టి మోహరింపులు చేపడుతున్నట్లు వివరించారు. ‘‘పరిస్థితులు అనుకూలిస్తే కొంత మేర బలగాలను క్రియాశీల విధుల నుంచి ఉపసంహరించి, సరిహద్దులకు కొంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో మోహరిస్తాం. తద్వారా సైనికులకు విశ్రాంతి, శిక్షణకు సమయం లభిస్తుంది. అయితే వారిని పూర్తిస్థాయిలో ఉపసంహరించబోం’’ అని చెప్పారు. అమర్‌నాథ్ యాత్రను సాఫీగా నిర్వహించడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు.
మూడో దశ వచ్చినా..
కొవిడ్ కట్టడికి చేపడుతున్న చర్యలూ ఒకరకమైన యుద్ధమేనని నరవణె తెలిపారు. ఈ పోరులో సైన్యం అన్ని వనరులనూ సమకూర్చిందని, ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు సర్వశక్తులూ ఒడ్డిందన్నారు. కొవిడ్ మూడో ఉద్ధృతి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. సైన్యాధిపతి తన పర్యటనలో స్థానిక సైనిక కమాండర్లతో భేటీ అయ్యారు. ఎల్‌వోసీ వెంబడి భద్రతా పరిస్థితులను వారు వివరించారు.