News

బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం… క్వాడ్లో చేరిక విషయంలో బెదిరింపులు..

421views

అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా చైనా తన దుందుడుకు వైఖరిని మార్చుకోవడం లేదు. తాజాగా బంగ్లాదేశ్‌ అంతర్గత వ్యవహారంలోనూ డ్రాగన్‌ జోక్యం చేసుకుంది. క్వాడ్‌లో చేరికపై ఆ దేశాన్ని హెచ్చరించింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కీలకంగా మారుతున్న ఆ కూటమిపై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. క్వాడ్‌లో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో రవాణా, వాణిజ్య కార్యకలాపాలు స్వేచ్ఛగా జరిగేలా చూడటం ఈ కూటమి ప్రధాన లక్ష్యం.

క్వాడ్‌ చట్రంలో భాగంగా బంగ్లాదేశ్‌, శ్రీలంక, మయన్మార్‌, మాల్దీవుల వంటి దక్షిణాసియా దేశాల్లో భారత్‌, జపాన్‌ సంయుక్తంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాయి. ప్రధానంగా బంగ్లాదేశ్‌, మాల్దీవుల్లో- రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు, ఆస్పత్రుల నిర్మాణం వంటి ప్రాజెక్టులను జోరుగా కొనసాగిస్తున్నాయి. కొవిడ్‌ విజృంభణపై చర్చించేందుకు ఈ ఏడాది క్వాడ్‌ నిర్వహించిన సమావేశానికి దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, వియత్నాం సైతం హాజరయ్యాయి. దీంతో కూటమి విస్తరణకు సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. క్వాడ్‌ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతుండటం చైనాకు ఆందోళన కలిగించింది. కూటమిలో చేరాల్సిందిగా బంగ్లాదేశ్‌పై అమెరికా, భారత్‌ ఒత్తిడి తెస్తాయేమోనని భయపడింది. ఒకవేళ వాటితో బంగ్లా చేతులు కలిపితే- దక్షిణాసియా భౌగోళిక, రాజకీయ వ్యవహారాల్లో చైనాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. ఆ పరిణామాన్ని అడ్డుకునేందుకు వెంటనే రంగంలోకి దిగింది. క్వాడ్‌లో చేరితే తమతో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయంటూ బంగ్లాదేశ్‌ను చైనా రాయబారి లీ జిమింగ్‌ నేరుగా హెచ్చరించారు. నాలుగు దేశాలతో కూడిన చిన్న కూటమిలో చేరడంవల్ల ఒరిగేదేమీ ఉండబోదని సూచించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.