News

కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్

430views

చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది. చైనాలో వైరస్‌ ఎలా ఏర్పడిందన్న అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తమ దేశ నిఘాసంస్థలను ఆదేశించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన వివరాలపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా కూడా వుహాన్‌లో కరోనా పుట్టుకపై విచారణ జరపాలని కోరింది. కరోనా వైరస్‌ వుహాన్‌ నగరంలోని జంతు విక్రయశాలల నుంచి వ్యాప్తి చెందిందని చైనా వాదిస్తోంది. అయితే అదే నగరంలోని ఒక ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

డబ్ల్యుహెచ్‌వో విచారణ మొదటి అడుగు మాత్రమే

కొవిడ్‌-19కు సంబంధించి చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌వో) దర్యాప్తు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణ సాగనీయకుండా చైనా అధికార యంత్రాంగం పలు అడ్డంకులు సృష్టించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు విచారణను ప్రపంచ ఆరోగ్యసంస్థ పూర్తిచేసింది. కానీ నివేదికలో గబ్బిలాల నుంచి వైరస్‌ ప్రబలివుంటుందని వెల్లడించింది. అయితే ల్యాబ్‌లో నుంచి లీక్‌ అనేది వాస్తవదూరంగా ఉండవచ్చని పేర్కొంది. ఈ విచారణ మొదటి అడుగు మాత్రమేనని పూర్తిగా దర్యాప్తు జరిపితే అన్నీ అంశాలు వెలుగులోకి వస్తాయని భారత్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

గుర్తు తెలియని జంతువు నుంచి..

మధ్య చైనాలో ఉన్న వుహాన్‌లో 2019 డిసెంబరులో ఈ వైరస్‌ బయటపడింది.దీన్ని SARS-CoV-2 అని వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సభ్యుల బృందంలోని ఒకరు దీనిపై మాట్లాడుతూ వుహాన్‌లో తమ పరిశోధనల్లో గబ్బిలాల నుంచి ఒక జంతువుకు అనంతరం మానవులకు సోకి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఏ జంతువు నుంచి సోకిందో అంతుచిక్కడం లేదని చెప్పడం గమనార్హం. అయితే వుహాన్‌లో దర్యాప్తు మొదటి దశ మాత్రమేనని అనంతరం పలు దఫాలుగా విచారణ చేపట్టాలని ఆయన చెప్పడంతో చైనా మూలాలపై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.

దర్యాప్తుకు రాజకీయాలు అడ్డంకిగా మారాయి – WHO

కొవిడ్-19 మహమ్మారి మూలాలను వెలికితీసే ప్రయత్నాలకు రాజకీయాలు ఆటంకం కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తల్ని తమపని తాము చేసుకోనివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

‘సైన్స్‌ను రాజకీయాల నుంచి వేరుచేయమని మేం అడగాలనుకుంటున్నాం. సరైన దారిలో, సానుకూల వాతావరణంలో మనకు అవసరమైన సమాధానాలను కనుగొందాం. ఈ ప్రక్రియను రాజకీయాలు విషతుల్యం చేస్తున్నాయి’ అని ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరక్టర్ మైకేల్‌ ర్యాన్‌ హెచ్చరించారు.

కరోనా మూలాలను అన్వేషించేందుకు సరికొత్త, లోతైన దర్యాప్తు జరపాలంటూ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి పెరుగుతోంది. సరైన సమాధానం కోసం పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయినట్లు మరోసారి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి మూలాలపై నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా విభాగాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జంతువుల నుంచి మానవులకు సోకిందా?

లేక ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా? అనే విషయంపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కరోనా వైరస్ నుంచి సంభవించిన మరణాల రేటు నుంచి దృష్టి మరల్చేందుకే అమెరికా ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేస్తోందని చైనా ఆరోపించింది. ఇక ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తోన్న విలయం కారణంగా.. 17కోట్లమందికి పైగా వైరస్ బారిన పడగా, 35లక్షల మందికి పైగా మృత్యు ఒడికి చేరుకున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.