ArticlesNewsProgramms

కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న RSS కార్యకర్తలు

1.4kviews

రోనా కారణంగా కాలం చేసిన వారి అంత్యక్రియలు చెయ్యడం ప్రతి ఒక్కరికీ చాలా కష్టంగా పరిణమించింది. కొన్నిచోట్ల ఆ అంత్యక్రియలకు అనధికారికంగా 40 వేల రూపాయల పైచిలుకు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరులోని కొంతమంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు అటువంటి వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. గూడూరు నగరంలో ఎక్కడైనా, ఎవరైనా కరోనా కారణంగా మరణించిన వారి బంధువులు ఈ కార్యకర్తల బృందాన్ని సంప్రదిస్తే వారే స్వయంగా వెళ్లి, ఆ పార్ధివదేహాన్ని ఘటనా స్థలం నుంచి స్మశానానికి తీసుకు వెళ్లి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉండడం విశేషం.

ప్రాథమికంగా ఈ కార్యక్రమంలో గూడూరు నగరంలోని సంఘ పరివార్ కార్యకర్తలు మనోజ్, విఘ్నేశ్, మల్లి, బత్తల రాజేశ్, రాజేశ్, సాయిముని తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యకర్తల స్ఫూర్తితో మరికొందరు సంఘ పరివార్ కార్యకర్తలు కూడా అంత్యక్రియలలో పాలు పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సదరు కార్యకర్తలకు అవసరమైన పీ పీ ఈ కిట్లు, తదితర ఖర్చులకు అవసరమైన ఆర్థిక వనరులను నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ కోట సునీల్ కుమార్ సమకూరుస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీ కోట సునీల్ కుమార్ మా VSK ప్రతినిధితో మాట్లాడుతూ ఈ అంత్యక్రియల కార్యక్రమాలను మరింత శాస్త్రోక్తంగా నిర్వహించడానికి, తగు జాగ్రత్తల మధ్య ఒక పురోహితుణ్ణి కూడా నియమించాలని యోచిస్తున్నట్టుగా తెలిపారు. సమీప బంధువులు, కుటుంబ సభ్యులు సైతం కనీసం ముట్టుకోవడానికి కూడా సందేహించే కరోనా మృతుల అంత్యక్రియలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కార్యకర్తల బృందాన్ని అందరూ వేనోళ్ళ కొనియాడుతున్నారు. కార్యకర్తలు కూడా శాంతి మంత్రము, భారత్ మాతాకీ జై నినాదాల మధ్య అత్యంత భక్తిపూర్వకంగా, శాస్త్రోక్తంగా మృతుల అంత్యక్రియలను నిర్వహిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.