కర్నూలు జిల్లాలో అనేక ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో చరుగ్గా పాల్గొంటూ వచ్చిన శ్రీ ఎం ఎస్ నరసింహులు ఆకస్మికంగా మృతి చెందారు.
కీర్తిశేషులు శ్రీ ఎం ఎస్ నరసింహులు గారు ఆర్ ఎస్ ఎస్ జ్యేష్ఠ కార్యకర్త . వారు కెమిస్ట్రీ లెక్చరర్ గా జమ్మలమడుగు నందికొట్కూరు నంద్యాల కళాశాలలో తమ సేవలు అందించారు. జమ్మలమడుగులో వారు రామశిలా ఉద్యమంలో శ్రీ ఏసీ తిరుపాలయ్యగారితో పాటు అనేక గ్రామాలు తిరిగి రామజన్మభూమి ఉద్యమస్ఫూర్తిని సమాజంలో నింపారు. కర్నూలు జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి రామజన్మభూమి ఉద్యమంలో జిల్లా అంతటికీ చక్కటి మార్గదర్శనం చేసి ఉద్యమం సఫలం కావడానికి అహరహం శ్రమించారు.
ఆ తరువాత శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నతపాఠశాల కార్యదర్శిగా తమ విశిష్ట సేవలను అందించారు. వారు పదవీ విరమణ చేశాక శ్రీ విద్యా పీఠం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించి ఆంధ్ర రాష్ట్రమంతటా పూర్తి సమయ కార్యకర్తగా పర్యటన చేసి విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచి కలుగజేసి అనేక పాఠశాలలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ చేయటానికి మార్గదర్శనం చేశారు . విద్యా భారతి నిర్వహించిన అనేక అఖిల భారత స్థాయి కార్యక్రమాలలలో పాల్గొని ఆ స్ఫూర్తిని విద్యార్థులలో నింపడానికి కృషిచేశారు. వారి మరణం కర్నూలు జిల్లాలోని సంఘ పరివార సంస్థలన్నింటికీ తీరని లోటని పేర్కొంటూ సంఘ పరివార్ కార్యకర్తలందరూ స్వర్గీయ నర్సింహులు గారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.