రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఒక దివ్యాంగ పూజారి మృతి చెందారు. ఆయనకు వినికిడి లోపం ఉండేది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ క్రోడి లాల్ మీనా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసం ముందు హతుడి మృతదేహంతో ధర్నాకి దిగారు. దీంతో రాజస్థాన్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
బధిరుడైన దేవాలయ పూజారి శంభో లాల్ శర్మ వారం క్రితం గుండెపోటుతో మరణించారు. కొందరు భూ కబ్జాదారులు భూ దురాక్రమణ కోసం ఆయనపై ఒత్తిడి తేవడం వల్లనే ఆయన గుండెపోటుకు గురయ్యారని బిజెపి ఆరోపిస్తోంది.
ఆ విషయంపై ఘటనా స్థలంలోనే బిజెపి నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా అక్కడినుంచి పోలీసులు వారిని బలవంతంగా ఖాళీ చేయించడంతో వారు మృతదేహాన్ని జైపూర్ కి తరలించి సీఎం అశోక్ గెహ్లాట్ నివాసానికి సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ చతుర్వేది, ఎంపీ డాక్టర్ క్రోడిలాల్ మీనా, సంగానేర్ ఎమ్మెల్యే అశోక్ లహోటి మరికొందరు ధర్నాలో పాల్గొన్నారు. దాంతో రాజస్థాన్ పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.
“ఒంటరిగా నివసిస్తున్న శంభూ లాల్ శర్మకి దౌసా జిల్లాలో హైవే కి దగ్గరలోనే రెండు ఎకరాల భూమి ఉంది. శంభూ లాల్ కి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి శంభూలాల్ కి ఉన్న వినికిడి లోపాన్ని ఆసరాగా చేసుకుని ఈ భూమిని బల్బీర్ అనే వ్యక్తి పేరున మరియు మరో మహిళ పేరున రిజిస్టర్ చేశాడు.” అని దౌసా జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెబుతుండగా బిజెపి నాయకుల కథనం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
శంభూలాల్ భూమి పై కన్నేసిన కొందరు భూ కబ్జాదారులు ఆయనను బెదిరించి బలవంతంగా ఆయన చేత సంతకం పెట్టించుకున్నారని, ఆ క్రమంలో ఒత్తిడికి గురి అయిన శంభూలాల్ కు గుండె పోటు వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.
కాగా ఈ ఘటనలో రిజిస్ట్రేషన్ ను వెంటనే రద్దు చేయాలని, జరిగిన ఘటనలో అధికారుల జోక్యంపై విచారణ జరిపించాలని, దేవాలయాలకు సంబంధించిన భూములలో జరుగుతున్న అక్రమాలపై, కబ్జాలపై, దురాక్రమణలపై వెంటనే విచారణ జరిపించాలని, దేవాలయ పూజారులకు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. హతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని, కుటుంబ సభ్యులలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వవలసిందిగా బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ కబ్జాదారులు సైర విహారం చేస్తూ ఉంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా, కళ్లుమూసుకుపోయి వ్యవహరిస్తోందని బిజెపి నాయకులు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
Source : OPINDIA.