Newsvideos

హోంమంత్రి కుల ధృవీకరణపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమీషన్

1.2kviews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత తాను అన్యమతస్థురాలై ఉండీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారని, ఆమె ఎన్నిక చెల్లదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) వారు రాష్ట్రపతి భవన్ కు,  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. రాష్ట్రపతి భవన్ ఆ ఫిర్యాదును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ పరిశీలనకు పంపి దాని పూర్వాపరాలను విచారించి తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించింది కూడా.

ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆ ఫిర్యాదుపై విచారించ వలసినదిగా గుంటూరు జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. శ్రీమతి సుచరిత తాను క్రీస్తును పూజిస్తానని, క్రైస్తవ మత విశ్వాసాలను ఆచరిస్తానని  ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

అలాగే గతంలో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా ఒక ఇంటర్వ్యూలో తాను క్రైస్తవ మతాన్నే అనుసరిస్తానని పేర్కొన్నారు. దాంతో ఆమె ఎన్నిక కూడా చెల్లదని, ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని పేర్కొంటూ LRPF రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది. శ్రీదేవి కులం విషయమై విచారించి తగు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశిస్తూ రాష్ట్రపతి భవన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమీషన్ కూడా దానిపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతున్నది.

ఏదేమైనా స్వధర్మాన్ని వీడి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారు ఎస్సీలుగా చెలామణి అవుతూ రాజ్యాంగము, ప్రభుత్వాలు తమకు కల్పిస్తున్న హక్కులను, తమ రిజర్వేన్లను అడ్డదారిలో అనుభవిస్తూ అసలైన ఎస్సీలైన తమకు అన్యాయం చేస్తున్నారని నిజమైన ఎస్సీలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇలాంటి నకిలీ ఎస్సీలు తమకు చెందవలసిన ఉద్యోగాలను, పదవులను కూడా ఇలా అడ్డదారిలో స్వంతం చేసుకుని తమకు, తమ కుటుంబాలకు, తమ పిల్లకు, భావి తరాలకు తీరని ద్రోహం చేస్తున్నారని, అసలైన ఎస్సీలందరూ ఈ విషయమై మెళకువగా మెలగాలని, నకిలీ ఎస్సీల ఆట కట్టించాలని వారు పిలుపునిస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.