News

ఐఎస్‌ఐకి సమాచారమిస్తున్న హెచ్‌ఏఎల్‌ ఉద్యోగి అరెస్ట్‌

367views

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఓ ఉద్యోగి దీపక్ శ్రీసత్ (41)ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. యుద్ధవిమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్‌ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐఎస్‌ఐతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడన్న పక్కా సమాచారంతో నాసిక్‌కు చెందన రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) అతడిని అరెస్ట్‌ చేసింది.

దేశీయ యుద్ధవిమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సదరు ఉద్యోగి ఐఎస్‌ఐతో పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే నాసిక్‌కు సమీపంలో ఓజార్‌ ప్రాంతంలో ఉన్న హెచ్‌ఏఎల్‌ తయారీ కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇతను అందజేసినట్లు గుర్తించారు. అధికార రహస్యాల చట్టం కింద నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఐదు సిమ్‌ కార్డులు, రెండు మెమొరీ కార్డులు సీజ్‌ చేసినట్లు చెప్పారు. పోన్లు, సిమ్‌కార్డులను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పరిశీలన నిమిత్తం పంపించినట్లు వివరించారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచ్చగా 10 రోజుల రిమాండ్‌ విధించింది. నాసిక్‌కు సమీపంలో 1964లో ఏర్పాటైన తయారీ కర్మాగారంలో మిగ్‌-21ఎఫ్‌ఎల్‌, మిగ్‌-21ఎం, మిగ్‌-21బీఐఎస్‌, మిగ్‌-27ఎం వంటి యుద్ధ విమానాలతో పాటు, కె-13 మిస్సైల్‌ కూడా తయారవుతున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.