News

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం దగ్ధం

701views

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే రథానికి మంటలు అంటుకోవడం ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పనా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీ.

విచారణకు ఆదేశించిన మంత్రి :

లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను నియమించారు. దేవాదాయశాఖ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి విచారణ చేపట్టాలని సూచించారు. రథం పునఃనిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు.

హిందూ సంఘాల ఆగ్రహం :

హిందూ దేవాలయాల ఆస్తులు వరుసగా ధ్వంసమవుతూ ఉండడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు బిట్రగుంట దేవస్థానంలో రథం తగులబడిపోవడం, మొన్న నెల్లూరు సోమశిల దేవాలయంలో విగ్రహారాల చోరీ, ఇప్పుడు అంతర్వేది దేవాలయ రథం తగులబడిపోవడం….. ఇవన్నీ ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తుల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు…. ఇదీ ప్రస్తుత స్థితి. ఈ వరుస ఘటనలకు బాధ్యులెవరు? అన్య మతస్తుల కుట్రా? ఆకతాయిల పనులా? మతిస్థిమితం లేనివారి పనులా? మతిస్థిమితం లేనివారైతే హిందూ దేవాలయాల ఆస్తులే ఎందుకు ధ్వంసం చేస్తారు? దీనిపైన ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.