
దేశ రక్షణకు సరిహద్దుల్లో గస్తీ కాయడమే కాదు పక్క వారికి ఆపదొస్తే అదే స్ఫూర్తిని కనబరుస్తామని చాటారు మన జవాన్లు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద సాహసమే చేశారు. రాళ్లూ రప్పలు, వాగులూ వంకలూ దాటుకుంటూ 15 గంటల పాటు ప్రయాణించి స్ట్రెచర్‌పై మోసుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లా లాప్సా అనే మారుమూల గ్రామానికి చెందిన మహిళ ఈ నెల 20న ప్రమాదవశాత్తూ కొండపై నుంచి జారి పడడంతో ఆమె రెండు కాళ్లూ విరిగాయి. మారుమూల ప్రాంతమైన అక్కడికి హెలికాప్టర్ కూడా చేరుకోలేని పరిస్థితి. రెండు రోజులుగా వైద్యం కోసం అల్లాడుతున్న ఆమె గురించి తెలుసుకుని సాయం చేసేందుకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ముందుకొచ్చింది.
మహిళ నివసిస్తున్న గ్రామానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిలాం బోర్డర్‌లో గస్తీ కాస్తున్న 14వ బెటాలియన్‌కు చెందిన 25 మంది సిబ్బంది ఆమెను రక్షించేందుకు గ్రామానికి చేరుకున్నారు. స్ట్రెచర్‌పై ఆమెను ఉంచి రోడ్డు మార్గానికి చేర్చేందుకు సుమారు 40 కిలోమీటర్ల నడిచారు. పొంగిపొర్లుతున్న వాగులు దాటుకుంటూ 15 గంటల పాటు శ్రమించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. జవాన్ల సాహసాన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కొనియాడారు. దేశ సరిహద్దులనే కాదు అవసరమైతే ప్రజల ప్రాణాలను కాపాడ్డానికి శౌర్యాన్ని, విధేయతను, పట్టుదలను ఐటీబీపీ చాటుతుందని మరోసారి నిరూపించిందంటూ ట్వీట్ చేశారు. భరతమాత బిడ్డలకు ఇవే మా సెల్యూట్ అంటూ పలువురు నెటిజన్లు సైతం జవాన్లపై ప్రశంసల వర్షం కురిపించారు.