
లెబనాన్‌కు భారత్ మరోసారి చేయుతనందించనుంది. ఆగస్టు 4న లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుడు కారణంగా 150 మందికిపైగా మృతిచెందారు. అనేక నిర్మాణాలు కూలిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. మొదట కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది. కాగా స్థానిక అధికారులకు సహకరించేందుకు దేశం నుంచి మానవ వనరులను పంపనున్నట్లు అమెరికాలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ త్రిపాఠి తాజాగా వెల్లడించారు. ‘భారత ప్రభుత్వం తరఫున లెబనాన్ ప్రజలకు, ప్రభుత్వానికి మా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. దుర్ఘటన సమాచారం విన్న తర్వాత నిర్ఘాంతపోయాం. ఘటన అనంతరం అధికారులు, స్థానికుల పనితీరు ప్రసంశనీయం. ఎంతో అంకితభావం ప్రదర్శించారు. వారికి తోడ్పాటునందించేందుకు భారత్ నుంచి మానవ వనరులను పంపించనున్నాం’ అని త్రిపాఠి పేర్కొన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు భారత ప్రభుత్వం లెబనాన్ ప్రభుత్వంతో మంతనాలు సాగిస్తోందని తెలిపారు.
ఈ నెల ఆగస్టు 4వ తేదీన బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 158 మంది మృతిచెందారు. 6 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ భారీ పేలుళ్ల ధాటికి నగరంలోని సగానికిపైగా కట్టడాలు దెబ్బతినడంతో వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 2,750 మెట్రిక్ టన్నుల నైట్రేట్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది.