
జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్ నిన్నటి నుంచి కనిపించడంలేదని భారత సైన్యం తెలిపింది. షోఫియాన్ జిల్లాలోని హర్‌మైన్ ప్రాంతంలో నివసించే షాకిర్ మన్‌జూర్ అనే జవాను ఆచూకీ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి తెలియరావడంలేదని వెల్లడించారు. ఇతను 162 బెటాలియన్‌లో రైఫిల్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులే అతణ్ని కిడ్నాప్ చేసి ఉంటారని జమ్మూ-కశ్మీర్ పోలీసులు, సైన్యం అనుమానిస్తున్నాయి. జవాను ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, సైన్యం కలిసి ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు జమ్మూ-కశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
”162 బెటాలియన్ (టీఏ)కు చెందిన రైఫిల్ మెన్ షాకిర్ మన్‌జూర్ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కనపడటంలేదు. కాలిపోయిన అతడి కారును కుల్గాం సమీపంలో కనుగొన్నాం. ఉగ్రవాదులే అతణ్ని అపహరించి ఉంటారని అనుమానిస్తున్నాం. అతని ఆచూకీ కనుగోనేందుకు భద్రతా బలగాలు వెతుకుతున్నాయి” అని టెర్రరిజంఫ్రీకశ్మీర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించి భారత్ సైన్యం చినార్ కార్ప్స్ విభాగం ట్వీట్ చేసింది. గతంలో షోపియాన్ జిల్లాకు చెందిన ఔరంగజేబ్ అనే జవానును ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఉగ్రవాదులు షాకిర్‌ను అపహరించి ఉంటారిని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.