News

అయోధ్య రామ మందిరం శంకుస్థాపనకు అతిథులు వీరే

727views

రామ మందిరం భూమి పూజ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమి పూజ కార్యక్రమానికి ఎంత మందిని ఆహ్వానించారు? స్టేజిపై ఎవరెవరు ఉంటారు? ప్రధాని ముందుగా ఏం చేస్తారు? అనే దానిపై తొలిసారిగా శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు స్పందించింది. మొత్తం 175 మంది ప్రముఖులతో పాటు, 135 మంది సాధువులను, అయోధ్యకు చెందిన కొందరు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపింది. కరోనా కారణంగా మరికొంత మంది అతిథుల శంకుస్థాపనకు ఆహ్వానించలేకపోయినట్లు ట్రస్టు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్‌ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌తో పాటు రామజన్మభూమి న్యాస్‌ అధిపతి నృత్యగోపాల్‌ దాస్‌ వేదిక పంచుకుంటారని వెల్లడించింది.

ప్రధాని మోదీ ముందుగా హనుమాన్‌ మందిరాన్ని దర్శించుకుని, అక్కడ నుంచి రామ జన్మభూమిలోని రామ్‌లల్లాలో పూజలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని ట్రస్టు వెల్లడించింది. ఈ పవిత్ర కార్యం కోసం 2వేల తీర్థక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి, 100 నదుల నుంచి నీరు తెప్పించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సాధువులు ఎన్నో రకాల పవిత్ర వస్తువులను భూమి పూజ కోసం పంపినట్లు ట్రస్టు వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నివారించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ, అన్ని గ్రామాలు, నగరాల్లో భజనలు, కీర్తనలు, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. భూమి పూజలో ఉపయోగించేందుకు వెండితో తయారు చేసిన ఐదు తమల పాకులను వారణాసికి చెందిన చౌరాసియా సంఘం అయోధ్యకు పంపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.