ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హిందూ దేవాలయాల విషయంలో ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నది. గతంలో పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ పేరుతో దేవాలయ భూములను కబళించాలని చూసింది. భక్తులు, ధార్మిక సంస్థల అభ్యంతరాలతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నది. అలాగే తితిదే భూముల అమ్మకానికి చేసిన ప్రయత్నాన్ని కూడా వెల్లువెత్తిన భక్తుల ఆగ్రహజ్వాలల కారణంగా విరమించుకున్న విషయం పాఠకులకు విదితమే.
ప్రస్తుతం తాజాగా ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన “అమ్మ ఒడి” పథకానికి సైతం దేవాలయ నిధులను వినియోగించాదలచిన విషయం వెలుగులోనికి వచ్చింది. నిజానికి ప్రభుత్వాలు తమ పథకాల అమలుకు ప్రభుత్వ నిదులనే వినియోగించాల్సి ఉండగా ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా దేవాలయ నిధులను వాడుకోజూడడం సమంజసం కాదని పలు ధార్మిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఆ నిమిత్తం ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే ఒక జీవోను కూడా విడుదల చెయ్యడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన “అమ్మఒడి” పథకం అమలు కోసం 24,24,75000 ( అక్షరాలా 24 కోట్లా 24 లక్షలా 75 వేల రూపాయల) దేవాదాయ నిధిని కేతాయించినట్లుగా జి.ఓ నంబర్ 18 లో స్పష్టంగా పేర్కొని ఉండడం గమనార్హం.
భక్తులు తాము నమ్మిన దైవానికి, ఆ దేవాలయాల అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు, ధర్మ రక్షణకు పనికి వస్తుందనే ఉద్దేశ్యంతో భక్తితో కానుకలు సమర్పిస్త్తారని, కానీ ప్రభుత్వం ఈ విధంగా ఇతర, ప్రభుత్వ పథకాల అమలు కోసం ఆ నిధులను వెచ్చించడం ఎంతవరకూ సమంజసమని రాష్ట్రంలోని వివిధ ధార్మిక సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వానికి కనీసం తమ ఆదాయ వ్యయాల లెక్కలను చెప్పని, ప్రభుత్వ జోక్యాన్ని ఏమాత్రం అంగీకరించని అన్యమతాలకు చెందిన పాస్టర్లకు, ఇమాంలకు మాత్రం నెలనెలా వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వ పథకాలకు దేవాలయ నిధులను ఎలా దారి మళ్ళిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. దేవాలయ నిధులను, హిందూ దేవాలయాల అభివృద్ధికి, హిందూ ధార్మిక కార్యకలాపాలకు, హిందూ ధర్మ రక్షణకు మాత్రమే వినియోగించాలని వారు స్పష్టం చేస్తున్నారు.