
గాల్వన్ లోయలోకి ఇటీవల చైనా చొరబడటం, అక్కడ దౌర్జన్యానికి తెగబడి 20 మంది భారతీయ సైనికులను హతమార్చడంతో దీర్ఘకాలంగా నలుగుతున్న ఇండో-చైనా సరిహద్దు వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 1962 యుద్ధం తరువాత ఇంత పెద్ద ఎత్తున దారుణానికి పాల్పడిన చైనాతో సరిహద్దు వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడం సాధ్యమేనా?
చైనా విస్తరణ కాంక్ష:
తన పొరుగు దేశాలతో సరిహద్దులపై తప్పుడు వాదనలు సృష్టించడం ,అక్కడి ప్రదేశాలను వివాదాస్పదం చేయటం, ఆపై వాటిని ఆక్రమించటం చైనా యొక్క ప్రధాన వ్యూహం. చైనా తన సమీప పొరుగువారితోనే కాకుండా, సుదూరంగా ఉన్న దేశాలతో కూడా ప్రాదేశిక వివాదాలను సృష్టించి దురాక్రమణకు పూనుకుంటూ ఉంటుంది. సరిహద్దులోని ఇతర దేశాల భూభాగంలో కొంత ప్రదేశంలోనికి చొరబడి, దానిని తన అక్రమ ఆక్రమణలో ఉంచటంతో మొదలుపెడుతుంది. ఆ పై తప్పుడు ప్రచారం ద్వారా ఆ ప్రదేశం తనదేనని వాదిస్తుంది. ఇతర దేశాలు గట్టిగా స్పందించకపోతే అది వారి తప్పుగా మారి చైనా తన వాదనే నిజమని ప్రచారం చేసుకుంటూ, తన దురాక్రమణని సమర్ధించుకుంటుంది.

సాధారణంగా అందరికీ తెలిసినదానికి విరుద్ధంగా, మావో జెడాంగ్ అసమాన సామ్రాజ్యవాద కాంక్ష కలిగిన వాడు. ఆక్రమణల ద్వారా చైనా భూభాగాన్ని విస్తరించటం అతనితో ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే, అతను ఇన్నర్ మంగోలియా, తూర్పు తుర్కెస్తాన్ మరియు టిబెట్ ల పై దాడి చేశాడు. ఈ మూడు దేశాలు 1644 లో ముగిసిన, చైనా రాజవంశమైన హాన్ చైనీస్ పాలించిన మింగ్ రాజ్యంలో భాగాలు కావు. 1912 లో స్థాపించబడిన చైనా రిపబ్లిక్ లో కూడా ఈ మూడు దేశాలు భాగంగా లేవు. మంచు (చింగ్) పాలించిన భూభాగం, ఇతర దేశాలలో చైనీయులు తమ ప్రభావం చూపించిన దేశాలు, మరియు మంగోల్ (యువెన్) రాజవంశం నియంత్రించిన అన్ని భూభాగాలు ప్రస్తుత చైనాకు చెందినవే అనే తప్పుడు కథనం ప్రచారం చేయసాగారు. 1950 లో టిబెట్‌ను చైనా అక్రమంగా ఆక్రమించిన తరువాత, భారతదేశానికి చెందిన లడఖ్ లోని అక్సాయ్ చిన్ అనే ప్రదేశం లోంచి చైనా దుర్మార్గంగా రహదారిని నిర్మించడం ప్రారంభించింది.
మీడియా వక్ర భాష్యాలు :
ప్రముఖ వార్తా వ్యాఖ్యాత రాజ్‌దీప్ సర్దేశాయి ఇటీవలి పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ 1962 యుద్ధాన్ని ఎలాగైతే నెహ్రూ అభిమానులు చైనా యొక్క “గొప్ప నమ్మక ద్రోహం” గా చూస్తారో, అలాగే లడఖ్ 2020 ని కూడా భవిష్యత్తులో మోడీ అభిమానులు చైనా యొక్క దురాక్రమణగా, ద్రోహంగా అభివర్ణిస్తారని అన్నారు. కానీ ఆయన ఇక్కడ మరచిన విషయమేమంటే – నెహ్రూ యొక్క భారతదేశం చైనీయుల ద్రోహాన్ని ఊహించలేదు. కానీ మోడీ భారతం చైనా కుయుక్తులను ధాటిగా ఎదుర్కొనటానికి సిద్ధంగానే ఉంది. మొన్నటి చైనా దాడి ఆకస్మికంగా జరగలేదు. చైనా తన విస్తరణవాద ఉద్దేశ్యాలను ఎన్నడూ దాచలేదు. భారతదేశాన్ని చుట్టుముట్టడానికి చైనా యొక్క వ్యూహం, పాకిస్థాన్ దుష్కృత్యాలకు బహిరంగ మద్దతు, అణు సరఫరాదారుల సమూహంలోకి భారతదేశం ప్రవేశించడాన్ని వ్యతిరేకించడం, ఆర్టికల్ 370 ను రద్దు చేయడాన్ని, జమ్మూ & కాశ్మీర్ విభజన లను ఖండించడం వంటివి అన్నీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీరులో తన వ్యూహాత్మక ప్రయోజనాలను పరిరక్షించుకోవటానికే అనేది అందరికీ తెలిసిన విషయమే. డోక్లామ్ లో చైనా దుశ్చర్య ఇంకా భారత ప్రజల మదిలో తాజాగానే ఉంది. అందుకని లడఖ్ చొరబాటు ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. చైనా నుంచీ ఏ క్షణమైనా దురాక్రమణలు జరగవచ్చని ఊహిస్తున్న మన దేశ రక్షక దళాలు చైనా చేసిన ఈ దుశ్చర్యను నిజంగా నమ్మకద్రోహం అని అభివర్ణించలేదు.

భారత్, చైనా రెండూ కూడా తమ ప్రాచీన నాగరికతల పునాదులపై సంబంధ బాంధవ్యాలను నెరపాలని నెహ్రూ ఆకాంక్షించారని రాజదీప్ వ్యాఖ్యానించారు. 1950లో టిబెట్ ఫై దండయాత్ర చేసి ఆక్రమించిన తరువాత కూడా ఇలా ఆకాంక్షించటమంటే మతిస్థిమితం లేనివారికి మాత్రమే సాధ్యమని అనుకోవచ్చు. అయితే ఎంతో చరిత్ర కలిగిన భారతదేశం మరియు చైనా వంటి దేశాల మధ్యన దౌత్య సంబంధాలు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి మాత్రమే నిర్మించరాదని ఆయన సరిగ్గా ఎత్తి చూపారు.
చైనా దళాల ఆకస్మిక దాడి మన సైనిక దళాల వైఫల్యంగానూ, చైనా వ్యూహాత్మక దురుద్దేశాలను సరిగా అంచనా వేయకపోవడం అతిపెద్ద రాజకీయ మరియు దౌత్య వైఫల్యంగానూ రాజదీప్ అభివర్ణించారు. చైనా యొక్క దురాక్రమణ మరియు విస్తరణవాద దురుద్దేశాల గురించి సాధారణ పౌరులు సైతం గుర్తించిన ప్రస్తుత సందర్భంలో, చైనా ఉద్దేశాలను గమనించలేదనటం చాలా పెద్ద పొరపాటు. సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి మోడీ ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా కారణం అదే. వాస్తవానికి భారతదేశం చేపట్టిన ఈ నిర్మాణాలే చైనాలో అసహనాన్ని రేకెత్తించి దుశ్చర్యలకు ప్రేరేపిస్తోంది.
గత పాలకుల తప్పిదాలు నేడు మనకు శాపాలు :
మోడీ ప్రభుత్వం ముందు మన దేశానికి చెందిన లడఖ్ భూభాగాన్ని సురక్షితం చేయాలనీ, అంతవరకూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామనే ప్రకటనలు చేయవద్దని, కాశ్మీర్ లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించటం నెహ్రూ వైఫల్యమంటూ నిందించటం మానుకోవాలనీ రాజ్ దీప్ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. నిజానికి నెహ్రూని కాక ఈ తప్పిదానికి మరెవరిని నిందించాలి? నెహ్రూ తన ప్రభుత్వంలో ఉప ప్రధాని అయిన సర్దార్ పటేల్, మరియు రాజనీతి ఉద్దండులైనటువంటి లోహియా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, రాజాజీ మరియు ఎంతో అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కల్గిన ఆర్మీ జనరల్స్ ఇచ్చిన ప్రతి సలహాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. కాశ్మీర్ సమస్యను సరిగా పరిష్కరించకపోవటమే కాక ఆదిలోనే త్రుంచవలసిన ఈ సమస్యను అంతర్జాతీయం చేయటం ద్వారా కాశ్మీర్ రావణకాష్టంలా రగలటానికి దోహదపడటం జగద్విదితమే.

మన దేశానికి, చైనాకి మధ్యలో మనకి మిత్ర రాజ్యంగా ఉంటున్న టిబెట్ ని, ఆ తరువాత అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా దురాక్రమణ ద్వారా స్వాధీనం చేసుకున్నప్పుడు నెహ్రూ పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. 1962 లో చైనా భారతదేశంపై దండెత్తినప్పుడు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి కోసం నెహ్రూ అభ్యర్థించని దేశం లేదు. ఆ యుద్ధంలో భారతదేశం దౌత్యపరంగా, మన భూభాగం కోల్పోవటం పరంగా భారీ మూల్యం చెల్లించింది. తరువాత కూడా, పాకిస్తాన్ గిల్జిత్ మరియు బాల్టిస్తాన్లను ఆక్రమించడానికి మరియు దానిలో కొంత భాగాన్ని చైనాకు ఇస్తున్నప్పుడు ప్రతిఘటించకపోవటం వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన వ్యూహాత్మక తప్పిదాలు. ఈ తప్పిదాల వలన ప్రస్తుత, భావి తరాలు అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలతో నిరంతర కలహాలు, యుద్ధ భయాల పరంగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తోంది. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో మనది పైచేయిగా ఉన్నప్పుడు కూడా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి రావాలని భారతదేశం డిమాండ్ చేయలేదు. భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను పరిరక్షించడంలో నెహ్రూ మరియు ఆయన వారసులు పూర్తిగా విఫలమైన విషయం చరిత్ర స్పష్టం చేస్తున్న నిజం.
సంక్షోభ సమయంలోనూ రాజకీయ వ్యాఖ్యలా? :

దేశం యొక్క రాజకీయ మరియు సైనిక నాయకత్వం వెనుక దేశం ఒకటిగా నిలబడవలసిన ప్రస్తుత క్లిష్ట సమయంలో, మరో నెహ్రూ కుటుంబ సభ్యుడైన రాహుల్ గాంధీ మన ప్రధాని నరేంద్ర మోడిని ‘సరెండర్’ మోడీ అని పిలవటం పూర్తిగా గర్హించదగ్గది. పలువురు నోబెల్ అవార్డు గ్రహీతలతో ఇటీవల చర్చలు జరిపినప్పటికీ, ఈ విషయం యొక్క తీవ్రతపై అతని అవగాహన లేమి అర్థమవుతూనే ఉంది. ఆర్టికల్ 370 ను రద్దు చేయడం మరియు లడఖ్ ను కేంద్ర భూభాగంగా మార్చడంపై పాకిస్తాన్ కంటే చైనాయే ఎక్కువ రాద్థాంతం చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీరును తిరిగి స్వాధీనం చేసుకోకుండా భారతదేశాన్ని నిరోధించడమే చైనా యొక్క ప్రధాన వ్యూహం. పాకిస్తాన్ 1963 లో చైనాకు ఉదారంగా ఇచ్చిన షాక్స్ గామ్ లోయ POK లో ఉంది. అంతేకాకుండా, చైనా యొక్క ప్రతిష్టాత్మక బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) కు POK చాలా కీలకం. ప్రతిపాదిత చైనా – పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి) POK గుండా వెళుతుంది.
మన రక్షణ చర్యలే చైనా అసహనానికి కారణం :
భారతదేశం ఈ కారిడార్‌ను తీవ్రంగా వ్యతిరేకించడమే కాక ప్రాంతీయ మరియు ప్రపంచ ఆధిపత్యం కోసం చేపట్టిన చైనా యొక్క ఈ ప్రయత్నంలో చైనాతో చేతులు కలపని ఏకైక దేశం మనది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దేశంలో సంపూర్తిగా విలీనం చేయటం, లడఖ్ ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా రూపాంతరం చెందటం నేరుగా కేంద్రం యొక్క ప్రత్యక్ష నియంత్రణలోకి రావడంతో బిఆర్‌ఐకి సవాలు గణనీయంగా పెరిగింది. అందువల్లనే గల్వాన్ లోయ మరియు నాథులా పాస్ లలో సరిహద్దు ఉల్లంఘనల ద్వారా కొత్త వివాదాలకి చైనా తెర లేపింది. వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రదేశాలలో సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడటమే కాక నేపాల్ లో భారత్ పై ద్వేషం పెంచటం ద్వారా అక్కడ మనకు మరొక ఘర్షణపూరిత ప్రాంతాన్ని తయారు చేసింది చైనా.

India China border road
మే ఆరంభం నుండి వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ రివర్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్ మరియు పాంగోంగ్ సరస్సు అనే మూడు ప్రాంతాల వద్ద చైనా సైనిక దళాలు కవ్వింపు చర్యలతో మన సైనిక దళాలకు సవాలు విసురుతుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. చైనా దురాక్రమణలో ఉన్న అక్సాయ్ చిన్‌కు పశ్చిమాన మన దేశంలోని ఈశాన్య లడఖ్ కి చెందిన గాల్వన్ లోయలో ప్రస్తుత ఘర్షణలు జరిగాయి. ఈ మధ్యనే అక్సాయ్ చిన్ ప్రాంతానికి సమీపంలో, మన సరిహద్దులోపల 255 కిలోమీటర్ల పొడవైన, అన్ని వాతావరణాలకు తట్టుకోగల రహదారి నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసింది. ఈ రహదారి నుండి గాల్వన్ లోయలో గస్తీ ప్రదేశం 14 వరకు వెళ్లేలా ఒక రహదారి మరియు వంతెనను నిర్మించడాన్ని ఆపడానికి భారతదేశం నిరాకరించడంతో, చైనీయులు అసహనానికి గురై గాల్వన్ లోయలో మన సరిహద్దులోకి చొరబడ్డారు. గాల్వన్ లోయలో తన చొరబాటు గురించి చర్చించడానికి చైనా నిరాకరిస్తోంది. పైగా మొత్తం ఆ లోయపై తనదే హక్కు అని వాదిస్తోంది.
ఇదే సరయిన సమయం :
అయితే వాస్తవమేమిటంటే, కొంతమంది విశ్లేషకులు మరియు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్లుగా కాక రాజకీయపరంగా, సైనికపరంగా, ఈసారి భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉంది. కార్గిల్ యుద్ధం జరిగిన తరువాత మన సైనిక దళాలు లేహ్‌లో ఒక కొత్త సైనిక కార్ప్స్‌ను ఏర్పాటు చేశాయి. అంతే కాక గత ఆరు సంవత్సరాలలో సరిహద్దు పొడుగునా మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపరచబడ్డాయి. ప్రస్తుత పరిస్థితి 1962 నాటితో పోలిస్తే చాలా మారిపోయింది. చైనాకు ధీటైన సమాధానం ఇచ్చేలా సరిహద్దులలో మన సైనిక పహారా పెరిగింది.
నిఘా సామర్థ్యాలను మెరుగు పరచుకుని మన దేశ సైనిక దళాలు చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) దుందుడుకు చర్యలను ఎదుర్కోవటమే కాక వారికి భారీ నష్టాలను కలిగించడానికి బాగా సన్నద్ధంగా ఉన్నాయి. భయంకరమైన కరోనా వైరస్ గురించి సమాచారాన్ని సరైన సమయంలో ముందస్తుగా ప్రపంచానికి అందించడంలో విఫలమైనందున చైనా అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోయి ఒంటరిగా నిలిచింది. 1962 యుద్ధంలో మనం కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదా? సైనిక మరియు వ్యూహాత్మక నిపుణులు ఈ అంశంపై దృష్టి పెట్టాలి.

చైనా పాలకులు బహిరంగంగా చెప్పేదానికి, వాస్తవంగా వారు చేసే పనులకు పొంతన ఉండదని ప్రపంచమంతా తెలుసు. వారు అంతర్జాతీయ ద్వైపాక్షిక మరియు బహుళపక్ష ఒప్పందాలను తమ ప్రయోజనాల మేరకే గౌరవిస్తూ ఉండటం జగద్విదితమే. వాస్తవాలను మరుగున పెట్టి గోబెల్స్ ప్రచారం చేయటంలో సిద్ధహస్తులు. మావో జెడాంగ్ నుండి ఇప్పటి జి జిన్ పింగ్ వరకు కూడా తమ దేశ భూభాగాన్ని చట్టవిరుద్ధమైన మరియు దురాక్రమణల ద్వారా విస్తరించే ఏకైక ఎజెండాతో ప్రవర్తిస్తూ ఉన్నారు. చైనా యొక్క ప్రస్తుత భూభాగం లో 60 శాతం ఆక్రమిత భూభాగాలే అంటే అతిశయోక్తి కాదు. పైగా చైనా తరచుగా – టిబెట్ తన అరచేయి అనీ, లడఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్ మరియు అరుణాచల్ ప్రదేశ్ తన వేళ్లు – అని చెప్తూ ఉంటుంది. నయానో, భయానో తమ దేశ సరిహద్దుల విస్తరణే వారి లక్ష్యం. ప్రస్తుత తరం భారత నాయకత్వం చైనా సామ్రాజ్యవాద దురుద్దేశ్యాలను నెరవేరనివ్వదు. గాల్వన్ వ్యాలీలో చైనా దళాలను దీటుగా ప్రతిఘటించటమే అందుకు సరైన నిదర్శనం.





